
నీటి సమస్య పరిష్కారమే లక్ష్యం
కడప సెవెన్‌రోడ్స్: వేసవిలో గ్రామీణ ప్రజల దాహార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అన్నారు. అవసరమైన గ్రామాల్లో కొత్త బోర్లు, మోటార్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గురువారం జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి బోర్లకు యుద్ధ ప్రాతిపదికపై విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. గండిక్షేత్రంలో భక్తుల సౌకర్యం కోసం లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన తాగునీటి ట్యాంకర్‌ను నిర్మించేందుకు రూ.35 లక్షలు అవుతుందని, అందులో రూ.25 లక్షలు జెడ్పీ నిధులను సమకూరుస్తానని తెలిపారు. ఇందుకు సంబంధించిన అంచనా వ్యయాలను తయారు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈని ఆదేశించారు. జిల్లా పరిషత్ నిధుల కేటాయింపులో అందరికీ సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లె చెరువులో ఈతకు వెళ్లి విద్యార్థులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ఆ చెరువులో కాంట్రాక్టర్లు ఇష్టానుసారం గుంతలు తవ్వి మట్టి తరలించడం విద్యార్థుల మృతికి కారణమన్నారు. బాధ్యులైన కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతోపాటు వారినుంచే బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఘన నివాళి: పాక్ దాడిలో అశువులు బాసిన వీర జవాను మురళీ నాయక్, వయోభారంతో ఇటీవల మరణించిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సీఎం బలరామిరెడ్డి మృతికి సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు వివిధ శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
అందరికీ సమానంగా జెడ్పీ నిధులు
సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి

నీటి సమస్య పరిష్కారమే లక్ష్యం