
వ్యాయామ విద్యకు మంగళం
మదనపల్లె సిటీ : కేజీ నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులకు వ్యాయమ విద్య కీలకం. అటువంటి విద్యను కూటమి ప్రభుత్వం సమూలంగా దూరం చేసే కుట్ర చేస్తోంది. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఒక పక్క ప్రభుత్వం మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా కింద పోస్టులను నిర్దేశించింది. ప్రత్యేకంగా క్రీడల్లో ప్రతిభ, సీనియారిటీ ద్వారా కోటాలో ఉద్యోగాలు కల్పించనుంది. ఈ పోస్టులు భర్తీ కేవలం 6 నుంచి 10వ తరగతి పాఠశాలల వరకే పరిమితం. ఇంటర్మీడియట్ కళాశాలకు మాత్రం పీడీ పోస్టులను భర్తీ చేయకపోగా ఉన్న వాటిని కూడా సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేస్తోంది.
ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఇకపై ఉండవు. ఇప్పటికే ఖాళీలను భర్తీ చేయకపోగా,కొత్త ఎంపికలను కూడా నిలిపివేసింది. పీడీ పోస్టులను సబ్జెక్టు అధ్యాపకుడిగా కన్వర్షన్ చేస్తూ తీసుకున్న నిర్ణయంతో ఇంటర్ విద్యార్థులు వ్యాయామ విద్యకు దూరం కానున్నారు. జిల్లాలో 21 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి.వీటిలో మదనపల్లె ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ రాజంపేట, ప్రభుత్వ జూనియర్ కాలేజీ , రైల్వేకోడూరులలో మాత్రం పీడీలు పని చేస్తున్నారు. రాయలసీమ జోన్ పరిధిలోని చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్ కడప జిల్లా, అనంతపురం జిల్లాల్లో 185 పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఉన్నత పాఠశాలల్లో పీఈటీ, పీడీ పోస్టులు ఉన్నాయి. పాఠశాల స్థాయిలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. తిరిగి డీగ్రీ కాలేజీల్లో కూడా పీడీ పోస్టులు ఉన్నాయి. కానీ మధ్యలో ఇంటర్ కాలేజీల్లో పీడీ పోస్టులు లేనందున వల్ల విద్యార్థులు క్రీడల్లో రాణించలేకపోతున్నారు. క్రీడామైదానాలు ఉన్న జూనియర్ కాలేజీల్లో పీడీ పోస్టులు ఉండేవి. అది కూడా ప్రస్తుతం లేకుండా చేస్తున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు వ్యాయామ విద్య అందని ద్రాక్షగా మారనుంది.
పోస్టు కన్వర్షన్ ఇలా
జూనియర్ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్ (పీడీ)గా పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందితే ఆ కాలేజీలో ఇక పీడీ పోస్టుకు మంగళం పలకనున్నారు. ఈ పోస్టులను అదే కాలేజీ లేదా పక్క మండలాల్లోని కాలేజీల్లో సబ్జెక్ట్ అధ్యాపకుడిగా కన్వర్షన్ చేసి పోస్టులను అక్కడ భర్తీ చేస్తున్నారు. విశాలమైన క్రీడామైదానాలు ఉన్నప్పటీకీ పీడీ పోస్టులను కన్వర్ట్ చేసి పోస్టులను తగ్గించుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పీడీ రిటైర్ అయితే ఆ పోస్టు రద్దు
ఇంటర్ కాలేజీలకు
పీడీ పోస్టుల భర్తీ లేనట్లేనా!
పీడీ పోస్టులు కోనసాగించాలి
జూనియర్ కాలేజీల్లో పీడీ పోస్టులు కొనసాగించాలి. దీనిపై ఇంటర్మీడియట్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశాం. జూనియర్ కాలేజీలో విద్యార్థులు క్రీడల్లో రాణిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఆలోచించి న్యాయం చేయాలి. – నరేష్, క్రీడాభారతి జిల్లా కార్యదర్శి

వ్యాయామ విద్యకు మంగళం

వ్యాయామ విద్యకు మంగళం