మదనపల్లె : మదనపల్లె మున్సిపాలిటీలో 2022–23 గుత్తలకు సంబంధించి గుత్తదారుడు చెల్లించిన రూ.29.50 లక్షలకు చేతిరాత రశీదులతో నిధులు స్వాహా కథనంపై అధికారులు విచారణ చేపట్టారు. బుధవారం కమిషనర్ ప్రమీల దీనికి సంబంధించి అప్పటి అధికారులను విచారించారు. ఇప్పటికే తీసుకున్న చర్యలను సమీక్షించిన ఆమె న్యాయపరమైన చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రశీదులు ఇచ్చిన ఉద్యోగి ఆ రశీదులను చేతిరాతతో ఎందుకిచ్చారు, ఎంత సొమ్ము తీసుకున్నారన్న దానిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా సమగ్రమైన విచారణ, ఉన్నతాధికారుల పరిశీలన లేకపోవడంతోనే ఇప్పటికి బాధ్యులను గుర్తించడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వివాహిత ఆత్మహత్య
రాజంపేట : రాజంపేట పట్టణ శివారులోని రామ్‌నగర్‌కు చెందిన ఓ వివాహిత నరసమ్మ (45) పోలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తన భర్త మద్యానికి బానిసై నరసమ్మతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవడంతో ఇంటికి రాడనే మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టిప్పర్ ఢీకొని ట్రాక్టర్ బోల్తా
చింతకొమ్మదిన్నె : వరి గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక వైపున టిప్పర్ ఢీకొనడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చింతకొమ్మదిన్నె మండలం ఆజాద్ నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో వరిగడ్డి కట్టలు చెల్లాచెదురయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోయినా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.
ప్రొద్దుటూరు ఆస్పత్రిలో గుర్తు తెలియని మృతదేహాలు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఇరువురు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలను భద్రపరిచారు. సుబ్బరాయుడు (60) అనే వ్యక్తి అనారోగ్యం కారణంగా ఈ నెల 12న జిల్లా ఆస్పత్రిలోని ఎంఎం–2 వార్డులో చేరాడు. మంగళవారం మృతి చెందాడు. ఐపీ రిజిష్టర్‌లో అతని పేరు మినహా ఊరు పేరు, సెల్ నంబర్ లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అలాగే బ్రహ్మయ్య (70) అనే వ్యక్తి ఈ నెల 11న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ 12న అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు.

నిధుల స్వాహాపై విచారణ ప్రారంభం