సంఘటన స్థలాన్ని పరిశీలించిన
మదనపల్లె డీఎస్పీ, సీఐ
యువతి కాళ్లు, చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగులు
డాగ్‌స్క్వాడ్‌కు కూడా అంతు చిక్కని వైనం
రామసముద్రం : రామసముద్రం మండలం చెంబకూరు–ఎలకపల్లి మార్గంలోని గుట్ట ప్రదేశంలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. సోమవారం ఉదయం రైతులు గుర్తించి విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మదనపల్లె డీఎస్పీ మహేంద్ర, సీఐ సత్యనారాయణలు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి గుర్తు తెలియకుండా కాలిపోవడంతో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతురాలి వయసు సుమారు 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు.
యువతిని అతి కిరాతకంగా చేతులు, కాళ్లు తాళ్లతో కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం దావానలంలా వ్యాపించడంతో చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా సమీపంలోని కర్నాటక నుంచి కూడా తండోపతండాలుగా చూసేందుకు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయినా ఎవరికి మృతదేహం ఎవరిదన్నది అంతుచిక్కలేదు. దీంతో చిత్తూరు నుంచి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. కుక్కలు మృతదేహం వద్ద నుంచి ఎలకపల్లి గ్రామం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చేశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక వీఆర్‌ఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు.