
వైభవంగా పల్లకీ సేవ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి ప్రధాన అర్చకులు మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. అనంతరం ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగు రంగుల పూలతో అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, స్థానికులతో పాటు కన్నడ భక్తులు పాల్గొన్నారు. వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.
నిత్యావసర వస్తువుల
ధరలు నియంత్రిస్తాం
రాయచోటి టౌన్ : నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తామని జిల్లా ఫౌరసరఫాల శాఖ అధికారి రఘురామయ్య సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు 22 రకాల నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు సేకరిస్తున్నట్లు తెలిపారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక, నిల్వల వివరాలు ప్రచురించాలని చెప్పారు. అక్రమంగా సరుకులు నిల్వలు ఉంచినా.. నల్లబజారుకు తరలించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇండియా– పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో నిత్యావసర వస్తువుల లభ్యత, ధరలపై సామాజిక మాధ్యమాల్లో వస్తన్న వార్తలు నమ్మొద్దని తెలిపారు.
బాధితులకు న్యాయం చేయాలి
రాయచోటి: వివిధ సమస్యలతో ప్రజావేదికకు వచ్చిన బాధిత సమస్యలను చట్టపరిధిలో పరిష్కరించి న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారంపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఫోన్‌ద్వారా ఎస్పీ సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను పోలీసుశాఖకు స్వేచ్ఛగా తెలియజేయడానికి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉపయోగపడాలని తెలిపారు.

వైభవంగా పల్లకీ సేవ