
విదేశీ విద్యావకాశాలపై అవగాహన
కురబలకోట: మారుతున్న ప్రపంచంలో వివిధ విదేశీ యూనివర్సిటీలు భారత విద్యార్థులకు అర్థవంతమైన అవకాశాలు కల్పిస్తున్నాయని హైదరాబాద్ ఆర్వ మేనేజ్‌మెంట్ సర్వీస్ రీసోర్సు పర్సన్ ఎ. అనిల్ కుమార్ అన్నారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో విదేశీ విద్య, స్కాలర్‌షిఫ్‌లపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రపంచ వ్యాప్తంగా కేరీర్‌లో విద్యార్థులు రాణించవచ్చన్నారు. ఆకాశమే హద్దుగా ఉపాధి, ఉద్యోగ రంగాలతో పాటు పరిశోధన రంగంలో విస్త్రృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందుకు విదేశీ ఉన్నత విద్యావకాశాలు కొత్త దిక్సూచిగా నిలుస్తున్నాయన్నారు. ప్రపంచ స్థాయిలో విద్యాభ్యాసం మనిషి జీవితంలో సరికొత్త అద్యాయానికి తెరలేపుతుందన్నారు. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలు భారత విద్యార్థులకు వీసా సడలింపులు, స్కాలర్‌షిప్ లు పెంచడం వంటి ప్రక్రియలతో విద్యార్థులు విదేశీ ఉన్నత విద్య పట్ల మక్కువ చూపుతున్నారన్నారు.భాషా నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అవసరమన్నారు. కార్యక్రమంలో ఇంగ్లీషు విభాగాధిపతి డాక్టర్ సమీనా తదితరులు పాల్గొన్నారు.