
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో పరిపాలన సాగలేదు...అంతా రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్ విమర్శించారు. ఆదివారం రాయచోటి పట్టణంలోని జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచం అంతా మహిళలను గౌరవిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అగౌరవపరుస్తున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను మరిచిపోయి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా పాలన సాగిస్తున్నారన్నారు. ఓ వైపు ఉగ్రవాదులతో దేశం యుద్ధం చేస్తుంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక మాజీ మహిళా మంత్రికే విలువ లేకుంటే ఇక సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా ఆ ర్గనైజింగ్ సెక్రటరీ సుగవాసి శ్యాం కుమార్ మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజని పీఏపై అక్రమ కేసులు బనాయించి తీవ్రవాదిని అరెస్టు చేసినట్లు తీసుకెళ్లడం అమానుషం అన్నారు. ఆ సంఘటకు కారణమైన సీఐ సుబ్బానాయుడును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కౌన్సిలర్ సుగవాసి పద్మ, గువ్వల నాగలక్ష్మి, గువ్వల బుజ్జి బాబు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట సబ్‌కలెక్టరేట్‌కు నూతనశోభ
రాజంపేట : రాజంపేట సబ్‌కలెక్టరేట్ నూతనశోభను సంతరించుకుంది. ఆదివారం జేసీ రాజేంద్రన్ ప్రారంభించారు. సబ్‌కలెక్టరేట్ భవనాలను ఇటీవల ఆధునీకరణ చేశారు. సబ్‌కలెక్టర్ వైఖోమానైదియా దేవి బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె సబ్‌కలెక్టరేట్ భవనాల ఆధునికీకరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో నూతన భవనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ వైఖోమానైదియాదేవి, మదనపల్లె సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్‌తోపాటు రెవెన్యూ అధికారులు, సబ్‌కలెక్టరేట్ సిబ్బంది, వివిధ మండల అధికారులు పాల్గొన్నారు. కాగా నూతనశోభను సంతరించుకున్న సబ్‌కలెక్టరేట్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్ గుర్తింపు వచ్చింది.
గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దగ్ధం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న ఒక ట్రాక్టర్, రెండు చెత్త సేకరణ ట్రై సైకిళ్లు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆదివారం దగ్ధమయ్యాయి. ట్రాక్టర్ ఇటీవల మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టామని, ఎండ వేడిమికి మంటలు చెలరేగాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం