
పోలీసుల అదుపులో డ్రిప్ పైపుల దొంగలు
గుర్రంకొండ : అసలే టమాటాతో సహా ఏ ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఓ వైపు రైతులు అల్లాడుతున్నారు.. మరోవైపు రైతుల పొలాల్లో ఇష్టానుసారం డ్రిప్‌పైపులు, ల్యాడర్లులను చోరీ చేసుకెళుతున్న దొంగల్ని రైతులు పొలీసులకు పట్టించిన సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. దొంగల వద్ద నుంచి ఆటోతో సహా రూ. 2 లక్షలు విలువచేసే డ్రిప్ పరికరాలు, పైపుల్ని రైతులు రైతులు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల పరిధిలో రైతులు టమాటాతో పాటు ఇతర పంటల్ని సాగు చేసుకొంటున్నారు. పంట సాగుకు అవసరమైన డ్రిప్‌పైపులు, ల్యాడర్లను వేలాది రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తుంటారు. ఎకరం పొలానికి రూ. 30 వేలు నుంచి రూ. 40 వేలు విలువ చేసే పరికరాలను రైతులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల్లో కొంతమంది దొంగలు గుట్టుచప్పుడు కాకుండా డ్రిప్‌పైపులు, పరికరాలను పొలాల వద్ద చోరీ చేసుకెళుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దొంగలు పగలు పొలాల వద్ద రెక్కీలు నిర్వహంచి రాత్రిళ్లు యథేచ్ఛగా డ్రిప్ పరికరాల చోరీకి పాల్పడుతున్నారు. ఆదివారం కండ్రిగ గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా ఆటోలో డ్రిప్‌పైపులు, పరికరాలు తీసుకెళుతుండడంతో రైతులు అడ్డగించారు. పైపులకు సంబంధించిన వివరాలు ఆరా తీయగా దొంగలు పొంతనలేని సమాధానలివ్వడంతో రైతులు వారిని పట్టుకొన్నారు. సమాచారాన్ని పొలీసులకు అందించారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని రూ. 2 లక్షల విలువచేసే డ్రిప్ పరికరాలున్న ఆటోతో సహా దొంగలను పొలీస్ స్టేషన్‌కు తరలించారు. గుర్రంకొండ, కండ్రిగ గ్రామాల చుట్టుపక్కల పొలాల్లో పెద్ద ఎత్తున చోరీలు జరుగుతున్నాయి. దీంతో పోలీసులు దొంగల్ని విచారిస్తున్నారు. వాస్తవాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ఆటో సహా రూ.2 లక్షలు విలువచేసే పైపులు స్వాధీనం
దొంగల్ని పట్టించిన రైతులు