
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి
మదనపల్లె రూరల్ : మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సమ్మె సన్నాహక సమావేశం ఎన్.జి.ఓ కార్యాలయంలో జరిగింది. ఈసందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ... కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సమయంలో చర్చ లేకుండా తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను అమలుకై చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు భారత దేశంలోని యావత్ కార్మికవర్గం మే 20వ తేదీన సమ్మె చేయడం ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 13 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ సార్వత్రిక సమ్మె ఏ రంగంలో పనిచేసే కార్మికులకై నా కనీస వేతనం ధరలకు అనుగుణంగా 26 వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తుందని తెలిపారు. పెట్టుబడిదారి ఆర్థిక సంక్షోభాన్ని సామాన్య ప్రజలపై, కార్మికులపై బలవంతంగా రుద్దేందుకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను మే 20 సమ్మెలో కార్మికులు సంఘాలతో నిమిత్తం లేకుండా భారీగా పాల్గొనడం ద్వారా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి.రాజేశ్వరి, నాయకులు మధురవాణి, కృష్ణమూర్తి, ఐద్వా నాయకురాలు భాగ్యమ్మ తదితరులు మాట్లాడుతూ లేబర్ కోడ్ రద్దు చేయడం, ఇండియన్ లేబర్ ప్రైవేటీకరణను నిలిపివేయడం, ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా క్రమం తప్పకుండా సంప్రదింపులు జరపడం, నెలవారీ కనీస వేతనం రూ. 26,000, ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలవారీ పెన్షన్ రూ. 9,000 అందించడం సహా పలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే విరాళాలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా ఏ పథకం కిందకు రానివారికి నెలకు రూ. 6,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ రాజు, కృష్ణప్ప, శంకర్ నాయక్, గౌరీ, ప్రమీల, సుగుణ, ప్రభావతి, అఖిరున్నిష, విజయ తదితరులు పాల్గొన్నారు.