
నిందితురాలితో డీఎస్పీ కేశప్ప, పోలీసు అధికారులు
మదనపల్లె : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మద్యం మత్తులో ప్రతిరోజు వేధింపులకు గురిచేస్తుండటంతో విసిగి, వేసారి బాధలు భరించలేక మౌనంగా రోదించిన భార్య గుండెను రాయి చేసుకుంది. భర్త లేకపోతేనే తాను, పిల్లలు ప్రశాంతంగా ఉండగలమని భావించి అతనిపై పెట్రోల్ పోసి చంపాలని నిర్ణయించుకుంది. అనుకున్న ప్రకారం మద్యం మత్తులో మగతగా పడిఉన్న భర్తపై మంగళవారం అర్ధరాత్రి తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టింది. మంటల్లో కాలుతూ, హాహాకారాలు చేస్తున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బుధవారం వేకువజామున మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శరీరం బాగా కాలిపోవడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో ఇట్టికోట శ్రీధర్ మరణించాడు. కుమారుడి మరణంపై తండ్రి ఇట్టికోట లక్ష్మయ్య ఫిర్యాదుమేరకు కోడలు పసుపులేటి మమతపై కేసు నమోదుచేశారు.
గురువారం ముదివేడు పోలీసులు అరెస్ట్‌చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ కేశప్ప వెల్లడించారు. కురబలకోట మండలం తెట్టుపంచాయతీ పూజారివాండ్లపల్లెకు చెందిన ఇట్టికోట లక్ష్మయ్య కుమారుడు ఇట్టికోటశ్రీధర్, అదే గ్రామానికి చెందిన పసుపులేటి వెంకటరమణ మూడో కుమార్తె మమత ప్రేమించి 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి లక్కీ, దీపక్ ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి సమయానికే శ్రీధర్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. మద్యానికి బానిసైన శ్రీధర్ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తుండటంతో ఆర్మీ ఉన్నతాధికారులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిపివేస్తూ ఉద్యోగం నుంచి తొలగించారు. భార్య మమత ఆర్మీ ఉన్నతాధికారులను ఆశ్రయించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతే తన కుటుంబం రోడ్డున పడిపోతుందని ప్రాధేయపడింది. కరుణించిన ఆర్మీ అధికారులు ప్రయోజనాలను కల్పిస్తూ ఉద్యోగం నుంచి తొలగించారు.
దీంతో భార్యాభర్తలు, పిల్లలతో కలిసి 2020 నుంచి పూజారివాండ్లపల్లెలో నివాసం ఉంటున్నారు. అయితే రిటైర్మెంట్‌లో భాగంగా వచ్చిన మొత్తం డబ్బులు, నెలవారీ ఫించన్ శ్రీధర్ కుటుంబ అవసరాలకు కాకుండా జల్సాలు, మద్యం తాగేందుకు ఖర్చుచేసేవాడు. అడ్డుచెపితే భార్యపై వేధింపులకు పాల్పడేవాడు. భర్త శ్రీధర్ ప్రవర్తనపై గతంలో పలుమార్లు ముదివేడు పోలీస్‌స్టేషన్‌లో మమత ఫిర్యాదుచేయడం, పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకోవడం జరిగాయి. రోజులు గడుస్తున్నా శ్రీధర్‌లో మార్పు కనిపించకపోవడం, మూర్ఖత్వం ఎక్కువ కావడం, మొండిగా బెదిరింపులకు పాల్పడుతుండటంతో విసిగిన మమత భర్తను చంపేసి ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగా ఈనెల 6వతేదీ మంగళవారం మదనపల్లెలో పెట్రోల్ కొనుగోలు చేసింది. ఇంటికి వెళ్లి అర్ధరాత్రి దాటిన తర్వాత మద్యం మత్తులో నిద్రపోతున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఘటనాస్థలం నుంచి వెళుతుండగా అత్తమామలు గమనించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోడలు తమ కుమారుడికి చెందిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కాజేయాలనే దురుద్దేశంతో పెట్రోల్ పోసి హత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. మమతను ముదివేడు పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు పంపారు. విచారణలో రూరల్ సీఐ శివాంజనేయులు, ఎస్‌ఐ ముబీన్‌తాజ్ సమర్ధవంతంగా వ్యవహరించి తక్కువ వ్యవధిలో కేసును చేధించారు.