అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..! | Anil arrested in engineering student incident | Sakshi
Sakshi News home page

అఖిలను బలితీసుకున్నది.. బ్లాక్‌మెయిలే..!

Apr 28 2025 5:18 AM | Updated on Apr 28 2025 5:18 AM

Anil arrested in engineering student incident

అన్నమయ్య జిల్లాలో ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యపై వీడిన మిస్టరీ

బ్లాక్‌మెయిలర్‌ అనిల్‌ అరెస్ట్‌

రాజంపేట: అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఫిబ్రవరిలో జరిగిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని అఖిల (23) ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. ప్రేమజంటలు, మద్యం తాగేవారిని బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బు వసూలుచేసే పల్లపోతుల అనిల్‌కు­మార్‌రెడ్డి అరాచకాలకు అఖిల బలైందని తాజాగా వెల్లడైంది. ఇప్పటికే పలు కేసుల్లో నిందితుడైన అనిల్‌కుమార్‌రెడ్డిని శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మన్నూరు పోలీసుస్టేషన్‌లో ఆదివారం రాజంపేట ఏఎస్పీ మనోజ్‌ రామ్‌నాథ్‌హెగ్డే తెలిపారు. 

ఆయన తెలిపిన మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరుకు చెందిన అనిల్‌కుమార్‌రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్‌రింగ్‌రోడ్డు, పులివెందుల టౌన్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్, కదిరిరోడ్డులోని బట్రపల్లె మార్గాలలో ప్రేమ జంటలను, మద్యం తాగేవారిని టార్గెట్‌ చేసుకునేవాడు. పోలీసుశాఖకు చెందిన వాడినని చెప్పి.. వారి పేర్లు, ఫోన్‌ నంబర్లు తీసుకునేవాడు. కేసు నమోదుకాకుండా చూడాలంటే డబ్బులివ్వాలని బెదిరించి వసూలు చేసేవాడు. కొందరివద్ద లాక్కునేవాడు. 

ఈ నేపథ్యంలో రిమ్స్‌ హాస్పి­టల్‌ సమీపంలోని వాటర్‌ఫాల్‌  చూడటానికి వెళ్లిన అఖిల, ఆమె స్నేహితుల నుంచి వారి వివరాలను, డబ్బును తీసు­కున్నాడు. అనంతరం అఖిల, ఆమె స్నేహితులకు ఫోన్‌చేసి బ్లాక్‌మెయిల్‌ చేయసాగాడు. దీంతో భయపడిన అఖిల రాజంపేటలోని ఒక హాస్టల్‌లో ఫిబ్రవరి 3న  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

విచారణలో అనిల్‌కుమార్‌రెడ్డి బ్లాక్‌మెయిలే దీనికి కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడిపై ఇప్పటికే గుత్తి పోలీసుస్టేషన్‌లో పొక్సో, అనంతపురం త్రీటౌన్‌ పీఎస్‌లో దొంగతనం, ప్రొద్దుటూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో రేప్‌ అటెంప్ట్‌ కేసులున్నాయి. దొంగతనం కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కూడా ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement