
రాయచోటి: అన్నమయ్య జిల్లాను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ తెలిపారు. మంగళవారం సాయంత్రం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్‌లో నేషనల్ నారోటిక్స్ కో–ఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. అజెండా ఆంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు సమావేశంలో వివరించారు. నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, మదనపల్లి డివిజన్‌లలో 2021 నుంచి 2023 మార్చి వరకు 23 డ్రగ్ కేసులను నమోదు చేసి 150.53 కిలోల గంజాయి పట్టుకున్నామన్నారు. అలాగే 64 మంది నిందితులను గుర్తించామన్నారు. వీరిలో 24 మంది రిటైలర్లు, 27 మంది విక్రేతలు, 13 మంది వినియోగదారులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకొని జిల్లాలోని కళాశాలల్లో పోలీస్ శాఖ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఎవరూ బానిసలు కారాదన్నారు. వైద్య, ఆరోగ్యం, రెవెన్యూ, విద్య, అటవీ, డ్రగ్ తదితర శాఖల అధికారులు అందరూ పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. జేసీ తమీమ్ అన్సారియా, డీఆర్‌ఓ సత్యనారాయణ, ఆర్‌డీఓలు మురళీ, రంగస్వామి, డీఎస్పీలు సుధాకర్ రెడ్డి, శ్రీధర్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొండయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పక్కా ఇళ్ల నిర్మాణం
త్వరితగతిన పూర్తి చేయాలి
రాజంపేట: పక్కా ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ ఆదేశించారు. స్థానిక సబ్‌కలెక్టరేట్‌లోని అన్నమయ్య సభా భవనంలో హౌసింగ్‌శాఖ అధికారులతో ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో సబ్‌కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్ పాల్గొన్నారు.
కలెక్టర్ గిరీషా పీఎస్, ఎస్పీ హర్షవర్దన్ రాజు