సమష్టి కృషితో బ్రహ్మోత్సవాల నిర్వహణ

కేంద్రరైల్వేశాఖమంత్రికి వినతిపత్రం 
అందజేస్తున్న ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి   - Sakshi

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలంలో గల అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల విజయంతానికి సమష్టిగా కృషి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే వేలాది భక్తులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఎల్లవేళలా మండల వైద్యాధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మేడా కన్‌ష్ట్రక్షన్స్‌ తరపున దాదాపు 80 వేల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఒంటిమిట్టలో నిత్య కల్యాణం జరుగుతున్న సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దాదాపు 3 పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. ఇందుకు టీటీడీకి రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా పెళ్లికి నెల ముందే మేడా కన్‌స్ట్రక్షన్స్‌ వారితో మాట్లాడి నమోదు చేసుకుంటే టీటీడీకి చెల్లించాల్సిన మొత్తం రూ 10 వేలను తామే చెల్లిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

స్వామి పాదాలను

తాకిన సూర్యకిరణాలు

రాయచోటిటౌన్‌ : రాయచోటిలో కొలువైన భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం స్వామి విగ్రహ పాదాలను సూర్యకిరణాలు తాకాయి. కిరణాలు స్వామి వారి ఆలయ ముఖ ద్వారం ద్వారా నేరుగా గర్భగుడిలోని స్వామి వారి పాదాలను స్పృశిస్తూ నాభి వరకు వెళ్లాయి. సుమారు పదిహేను సెకన్ల పాటు స్వామి వారి పాదాలను తాకాయి. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఆలయ పాలక మండలి అధ్యక్షురాలు పోలంరెడ్డి విజయ, ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంచి పెట్టారు.

రైల్వేశాఖ మంత్రి దృష్టికి

రైళ్ల హాల్టింగ్‌ సమస్య

రాజంపేట: రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఐదు రైల్వేస్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్‌ కల్పించాలని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను రాజంపేట లోక్‌సభ సభ్యుడు పీవీ మిథున్‌రెడ్డి కోరారు. మంగళవారం రైల్వేశాఖమంత్రితో ఆయన కార్యాలయంలో ఎంపీ భేటీ అయ్యారు. హాల్టింగ్స్‌కు సంబంధించి పూర్తి వివరాలతో మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్‌కు ముందు ఏ రైళ్లకు హాల్టింగ్స్‌ ఉన్నాయో వాటన్నింటిని పునరుద్ధరించాలని, అలాగే రైల్వేకోడూరు, ఓబులవారిపల్లెలో ఆర్‌యూబీ నిర్మించాలని కోరామన్నారు. ఇందుకు రైల్వేమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎంపీతో పాటు గుంతకల్‌ రైల్వే డీఆర్‌యూసీసీ సభ్యుడు తల్లెం భరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

31న జాబ్‌మేళా

కడప కోటిరెడ్డిసర్కిల్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్‌ మేళాలను నిర్వహిస్తున్నామని వైఎస్సార్‌ జిల్లా ఉపాధికల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమో, బీటెక్‌, ఎంబీఏ చదివిన యువతీ యువకులు అర్హులని తెలిపారు. అభ్యర్థులు 19–40 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. ఆసక్తిగల వారు వివరాలను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌సీఎస్‌.జీఓవి.ఇన్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలన్నారు.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top