దుబాయ్‌లో కంపెనీ పేరుతో మోసం

మదనపల్లె : దుబాయ్‌లోని ఫ్రీ ట్రేడ్‌ జోన్‌ అయినటువంటి రసల్‌ఖైమాలో కంపెనీ పెడదామని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్‌ నుంచి ఓ వ్యక్తి రూ.1.07 కోట్లు విడతల వారీగా ఆన్‌లైన్‌లో డబ్బు తీసుకుని మోసం చేసిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పట్టణంలోని ఎన్‌వీఆర్‌ వీధికి చెందిన షేక్‌ జావీద్‌ దాదాసాహెబ్‌(44) బి.కొత్తకోటలో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఆయనకు పట్టణంలోని దక్నీపేటకు చెందిన ఇషాక్‌ అహ్మద్‌ బాడీగార్డ్‌ సివిల్‌ ఇంజనీర్‌గా పరిచయమయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయాలు పెరగడంతో... దేశంలోని పలు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలతో తనకు పరిచయాలు ఉన్నాయని, వారు తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన నకిలీ మెయిల్స్‌, ఇతర రుజువులను చూపి షేక్‌జావీద్‌ దాదాసాహెబ్‌ను దుబాయ్‌లో కంపెనీ పెడదామని నమ్మించాడు. జావీద్‌ సమకూర్చిన డబ్బులతో ఇషాక్‌ అహ్మద్‌ విజిటర్స్‌ వీసా తీసుకుని రసల్‌ఖైమాలో కంపెనీ ఏర్పాటుకు 2019 జూన్‌లో వెళ్లాడు. తర్వాత కంపెనీ కోసమని పలుమార్లు ఆన్‌లైన్‌ ద్వారా జావీద్‌ ఇషాక్‌కు డబ్బులు పంపుతూ వచ్చాడు. జావీద్‌ పంపిన డబ్బులతో ఇషాక్‌ మలక్‌ ఇంటర్నేషన్‌ ఎఫ్‌జెడ్‌ఎల్‌ఎల్‌సీ పేరుతో దుబాయ్‌లో కంపెనీని ప్రారంభించినట్లు చెప్పాడు. వ్యాపార లావాదేవీల కోసం జావీద్‌ నుంచి రూ.1.07 కోట్ల వరకు వసూలు చేశాడు. కొంతకాలం తర్వాత కంపెనీ వ్యవహారాలపై ఇషాక్‌ను జావీద్‌సాహెబ్‌ కోరితే సరైన వివరాలు పంపలేదు. దీంతో అనుమానం వచ్చి విచారణ చేస్తే ఇషాక్‌ చేతిలో దారుణంగా మోసపోయినట్లు తెలిసింది. దీంతో ఇషాక్‌ను తన డబ్బును తిరిగి చెల్లించాల్సిందిగా కోరాడు. అయితే దానికి అతను నిరాకరించి ఫోన్‌లోనూ అందుబాటులో లేకుండా పోయాడు. దీంతో జావీద్‌ దాదా సాహెబ్‌ నేరుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు. ఆయనకు అందజేసిన అర్జీని మదనపల్లె వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ ఇవ్వడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఇషాక్‌ అహ్మద్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హరిహరప్రసాద్‌ తెలిపారు.

ప్రైవేట్‌ కళాశాల కరస్పాండెంట్‌ నుంచి రూ.1.07 కోట్లు స్వాహా

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top