
ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. స్థలాల ధరలు పెరిగిపోవడంతో ఈ తంతు మరింత పెరిగింది. అయితే అధికారులు వీరికి ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా కాపాడుతున్నారు. ఇలాంటి సంఘటనలు మంగళవారం కురబలకోట, ఓబులవారిపల్లె మండలాల్లో చోటుచేసుకున్నాయి.
కురబలకోట : కురబలకోట మండలం కడప క్రాస్ సమీపంలో హైవే పక్కనున్న వైఎస్సార్ కాలనీలో భూకబ్జాకు పాల్పడుతున్నట్లు ఆ గ్రామ సర్పంచ్ సుభాషిణి రెవెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ 422 సర్వే నంబరులో 163 మంది లబ్ధిదారులు పక్కా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. కాలనీ ముందర హైవే పక్కన ప్రజోపయోగ అవసరాలకు అధికారులు 30 సెంట్ల భూమి వదిలారు. హైవే పక్కన విలువైన స్థలంగా గుర్తించిన కొందరు దీనిపై కన్నేశారు. రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే పునాది రాళ్లు తోలారు. జేసీబీతో పునాదులు తీశారు. కట్టడాలకు ప్రయత్నించారు. భూ కబ్జాదారులు ఏకంగా కాలనీకి కూడా దారి లేకుండా పునాదులు తీశారు. తెలుసుకున్న కాలనీ వాసులు తిరగబడ్డారు. స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వారు రెవెన్యూ అధికారులకు తెలిపారు. ఇది విలువైన ప్రభుత్వ భూమి కావడంతో కబ్జాకు యత్నించారని విచారణలో వెల్లడైంది. తహసీల్దారు ఎం.భీమేశ్వరరావు ఆదేశాలతో ఆ పునాదులను వెంటనే పూడ్చి వేశారు. అంతేకాదు కాలనీలో ప్రజోపయోగం కోసం కేటాయించిన సదరు భూమిలో ఎవ్వరూ ప్రవేశించరాదని మంగళవారం హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఎక్కడైనా మండలంలో ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, విక్రయించడం చేస్తే తమ దృష్టికి తీసుకు రావాలని తహసీల్దారు కోరారు.
జేసీబీలతో భూమి చదును చేస్తుండగా..
ఓబులవారిపల్లె : పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని పీ కమ్మపల్లెలో సర్వే నంబర్ 1150లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసే ప్రయత్నాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. 20 ఎకరాల్లో కొందరు మంగళవారం ఉదయం నుంచి రెండు జేసీబీలతో పిచ్చిమొక్కలను తొలగించే పనులు చేపట్టారు. ఈ విషయం తెలిసిన తహసీల్దార్ పీర్ మున్ని తన సిబ్బందిని పంపించి పనులను అడ్డుకున్నారు. రికార్డుల పరంగా ప్రభుత్వ భూమిగా ఉందని తహసీల్దార్ తెలిపారు. మీ వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ప్రశ్నించారు. లేనిపక్షంలో రెండు జేసీబీలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు కబ్జాకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పునాదులు తీసిన ప్రాంతంలో విచారణ చేస్తున్న అధికారులు
జేసీబీతో చేస్తున్న పనులను అడ్డుకుంటున్న రెవెన్యూ సిబ్బంది
