
యేసోబు మృతదేహం
ఓబులవారిపల్లె : మండలంలోని మంగంపేట పునరావాస కాలనీ 9వ వీధికి చెందిన కె. యేసోబు(45) జీవితంపై విరక్తి చెంది సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. డ్రైవర్‌గా పని చేస్తున్న యేసోబు మద్యానికి బానిసయ్యాడు. వచ్చే నగదు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా కలత చెందాడు. సోమవారం ఉదయం కొర్లకుంట రైల్వేట్రాక్ సమీపంలో ఎడమచేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతను తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, కొర్లకుంట రైల్వేట్రాక్ సమీపంలో ఉన్నానని చివరిసారిగా మాట్లాడటం కోసం ఫోన్ చేశానని తెలిపాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఉన్న యేసోబును రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తెలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ రామచంద్రయ్య తెలిపారు.