
మృతి చెందిన రాజేష్
మదనపల్లె : ఉపాధి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఓ యువకుడు కానరాని లోకాలకు వెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ వాసి దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లాపూర్ జిల్లా కుర్వపూర్వ గ్రామానికి చెందిన కాంతప్రసాద్ కుమారుడు రాజేష్(23) కొంత కాలం క్రితం పుంగనూరు మండలం ఈడిగపల్లె వద్ద ఉన్న రైస్‌మిల్లులో ఉపాధి కోసం వచ్చాడు. ఇతను ఆదివారం రాత్రి పుంగనూరుకు ద్విచక్రవాహనంలో వెళ్లాడు. తిరిగి వచ్చేటప్పుడు భీమగానిపల్లె వద్ద రోడ్డుపై ఏర్పడ్డ గుంతలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేష్‌ను స్థానికులు 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్సలు పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఉత్తరప్రదేశ్ వాసి దుర్మరణం