
షేక్ ఇబ్రహీం (ఫైల్)
రేణిగుంట (తిరుపతి జిల్లా): రేణిగుంట–రైల్వేకోడూరు మార్గం రేణిగుంట మండలం కుక్కలదొడ్డి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు.
రేణిగుంట ఎస్‌ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎంజీ రోడ్డుకు చెందిన షేక్ ఇబ్రహీం(21), షేక్ మహమ్మద్ ముషబర్ బాషా(30) వరుసకు అన్నదమ్ములు. ఎంజీ రోడ్డులో ఇబ్రహీం చెప్పుల దుకాణం, మహమ్మద్ ముషబర్ బాషా దుస్తుల దుకాణం నడుపుతున్నారు. మహమ్మద్ ముషబర్ బాషాకు వివాహమై ఏడాదిన్నర వయస్సు కలిగిన కుమారుడు ఉన్నాడు. ఇబ్రహీంకు ఇంకా వివాహం కాలేదు. సోదరులైన వీరిద్దరు ఆదివారం చైన్నెలోని తమ బంధువుల వద్ద ఓ మోటార్‌బైక్, సెల్‌ఫోను కొనుగోలు చేసేందుకు స్కూటర్‌పై ఆదివారం ఉదయం చైన్నెకి బయల్దేరారు. చైన్నెకి చేరుకుని అక్కడ బేరం కుదరకపోవడంతో కేవలం సెల్‌ఫోను మాత్రమే తీసుకుని ఆదివారం రాత్రి స్వస్థలానికి తిరుగు పయనమయ్యారు. అర్థరాత్రి 12 గంటల సమయంలో రేణిగుంట మండలం కుక్కలదొడ్డి సమీపంలోని దర్గా వంతెన వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తిరుపతి ఎస్‌వీ వైద్య కళాశాలకు తరలించారు. మృతుల బంధువులకు సమాచారం అందించడంతో వారు మార్చురీకి చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
మృతులు అన్నమయ్య జిల్లా
రైల్వే కోడూరువాసులు
వరుసకు అన్నదమ్ములు

మహమ్మద్ ముషబర్ బాషా (ఫైల్)