
తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెట్రోల్ బాటిళ్లతో కనకమ్మ, హరిబాబు
పెద్దతిప్పసముద్రం : స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట తల్లీకొడుకులు బొంతల కనకమ్మ, హరిబాబు సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లికి చెందిన హరిబాబుకు తమ పూర్వీకులకు సంక్రమించిన ఐదు సర్వే నంబర్లలో మొత్తం రూ.8.22 ఎకరాల భూమి ఉండగా, ఆస్తికి వారసులైన ముగ్గురిలో ఒక్కొక్కరికి 2.74 ఎకరాల భూమి భాగ పరిష్కారం చేసుకున్నారు. వీరిలో ఏడాది క్రితమే ఇద్దరికి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు కాగా తాను గతేడాది జూన్ నుంచి ముటేషన్‌కు దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకు అతీగతీ లేకుండా పోయిందని హరిబాబు వాపోయారు. సీఎం క్యాంపు కార్యాలయానికి, రాయచోటిలోని కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో తన గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదన్నారు. తన కుమారుడు శ్రీధర్‌రెడ్డి బెంగళూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఫీజులు కట్టలేదనే కారణంతో అర్ధాతరంగా ఇంటికి వచ్చేశాడని, తమ భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే బ్యాంకులో పంట రుణం పొంది ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అనంతరం తహసీల్దార్ విద్యాసాగర్ బాధితులతో చర్చించి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదన్నారు. అనంతరం తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ముటేషన్‌కు దరఖాస్తు చేసిన విషయం తనకు తెలిసినా భూ రీసర్వే ఆరంభం నుంచి అడిషన్ ఆఫ్ సర్వే నంబర్ ఆప్షన్‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిలుపుదల చేయడంతో తామేం చేయలేమన్నారు. అయితే సదరు భూమి వారి పూర్వీకుల నుంచి ఇప్పటి వంశీకులకు ఎలా సంక్రమించిందో సంబంధిత పత్రాలు, ఈసీ జతపరచి బాధితులు సమగ్ర విచారణకు సహకరిస్తే తాము వివరాలను జాయింట్ కలెక్టర్ లాగిన్‌కు పంపిన అనంతరం సదరు రైతు సమస్యను పరిష్కరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.
తల్లీకొడుకులు పెట్రోల్ బాటిల్‌తో..