
ఎస్పీతో మాట్లాడుతున్న ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ
రామాపురం/రాయచోటి అర్బన్ : వైఎస్సార్ జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న మృతిపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేశారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రామాపురం మండలంలోని గువ్వలచెరువు ఘాట్ ప్రాంతంలో అచ్చెన్న మృతదేహం లభించిన ప్రాంతాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యుడు జి.ఈశ్వరయ్యతో కలిసి రాయచోటిలోని జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌రాజును ఆయన కార్యాలయంలో కలిశారు. హంతకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించారు. హత్యకు పరోక్షంగా సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్‌పీ రాష్ట్రనేతలు నరేంద్ర మాదిగ, రామాంజనేయులు, శివయ్య, అన్నమయ్య జిల్లా ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు బండకింద మనోహర్, కడప జిల్లా కన్వీనర్ వెంకటేష్, ఎంఆర్‌పీఎస్ నేతలు ఆందన్, మహదేవ, నాగేంద్ర, నరసింహులు, రామా ంజులు, ఎంఈఎఫ్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: నగరంలోని ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ అచ్చెన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విష్ణుప్రీతం రెడ్డి, శ్యామలాదేవి, మామిళ్ళ బాబు, ఆనంద్, సూర్యుడు తదితరులు పాల్గొన్నారు.
కడప కోటిరెడ్డి సర్కిల్: రాయలసీమ ప్రజా సంఘాల జేఏసీ నాయకులు వి.రమణ, అవ్వారు మల్లికార్జున, సంగటి మనోహర్ జిల్లా కలెక్టర్ విజయ్ రామరాజును కలిసి వినతి పత్రం సమర్పించారు.
విషాదకరం
కడప అగ్రికల్చర్ : కడప బహుళార్థ పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ అచ్చెన్న మృతి విషాదకరం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుసంవర్ధశాఖ డైరెక్టర్ అమరేంద్ర అన్నారు. సోమవారం సాయంత్రం కడప వీసీపీని జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి శారదమ్మతో కలిసి సందర్శించి అచ్చెన్న మృతికి తమ సంతాపాన్ని తెలిపి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పరిణామాలపై వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ, కడప డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమణయ్య, ఐఎస్‌డీపీ ఏడీ డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ ప్రమోద్, డాక్టర్ శివరామిరెడ్డి, ఏపీవీఏఎస్‌ఎస్‌ఏ ప్రెసిడెంట్ డాక్టర్ నేతాజీ, సెక్రటరీ రాజశేఖర్, ఏపీఎన్‌జీవో అసోసియేషన్ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు త్రిసభ్య కమిటీ రాక
ప్రభుత్వ అదేశాల మేరకు మంగళవారం కడపలోని బహుళార్థ పశువైద్యశాలకు(వీపీసీ) పశుసంవర్ధకశాఖ అడ్మిషినల్ డైరెక్టర్‌తో కలిసి త్రిసభ్య కమిటీ వస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధశాఖ అధికారి డాక్టర్ శారదమ్మ తెలిపారు. ఈ కమిటీ ఇక్కడ పరిస్థితులపై ఆరా తీయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.