రాజంపేట టౌన్ : వచ్చే నెల 15వ తేదీ రాజంపేటలో మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాఽథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తాము దాదాపు ఎనభై కంపెనీల ప్రతినిధులను ఇక్కడికి తీసుకొస్తున్నామన్నారు. జిల్లాలో పదివేల మందికి పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యార్హతను బట్టి నెలకు 15 వేల నుంచి 50 వేల రూపాయల వేతనంతో కూడిన ఉద్యోగాలను పొందవచ్చని తెలిపారు. క్యూఆర్ కోడ్ ద్వారా నిరుద్యోగులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అందుకు సంబంధించిన వివరాలన్ని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు.
రామయ్య హుండీ ఆదాయం రూ. 6.59 లక్షలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామప్వామి ఆలయానికి సంబంధించి మార్చి నెల హుండీ ఆదాయం రూ. 6 లక్షల, 59 వేల, 238 వచ్చింది. ఈ విషయాన్ని ఆలయ ఇన్‌స్పెక్టర్ ధనుంజయుడు తెలిపారు. ఈ సోమవారం ఆలయ రంగమండపంలో స్వామి వారి హుండీ ఆదాయాన్ని టీటీడీ సిబ్బంది లెక్కించారు.
ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లు
రాయచోటి: ఎస్సెస్సీ–2023 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను విద్యార్థులు నేరుగా ఎస్సెస్సీ బోర్డు వెబ్‌సైట్ బీఎస్‌సీ.ఏపీ.జీవోవి.ఇన్ నుంచి డౌన్ లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్లపైన ప్రధానోపాధ్యాయుడి సంతకం, పాఠశాల సీలు అవసరం లేదని అన్నారు. కావున పదోతరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.