
అన్నమయ్య జయంతి ఉత్సవాలపై ఎమ్మెల్యే మేడాతో చర్చిస్తున్న పర్యాటకశాఖ అధికారులు
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 615వ జయంతి ఉత్సవాలపై జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. అన్నమయ్య పేరుతో జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం, జిల్లా యంత్రాంగం కలిసి కట్టుగా నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజంపేటలోని మేడాభవన్‌లో శాసనసభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డితో జిల్లా పర్యాటకశాఖ ప్రాంతీయు సంచాలకుడు డాక్టర్ రమణప్రసాద్, జిల్లా పర్యాటకశాఖాధికారి ఎం.నాగభూషణం భేటీ అయ్యారు. మే 6 నుంచి 12వరకు జయంతి ఉత్సవాలను టీటీడీ సహకారంతో వైభవోపేతంగా నిర్వహించాలని నిర్ణయించారు.
అన్నమయ్య విగ్రహం వద్ద..
అన్నమయ్య జన్మస్ధలి తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం(అన్నమయ్య థీంపార్కు) వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నారు. పర్యాటకశాఖ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్ రమణప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోందన్నారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉత్సవాలను నిర్వహించాల్సి ఉందన్నారు. అన్నమయ్య సంకీర్తనలు, గోష్టిగానం, నాదస్వర సమ్మేళనం, శ్రీవారి కల్యాణం, కూచిపూడి, భరతనాట్యం, సాహిత సదస్సులు, వ్యాసరచన పోటీలు తదితర సంప్రదాయ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సానుకూలంగా స్పందించారన్నారు.
అన్నమయ్య పేరుతో జిల్లా ఆవిర్భావం తర్వాత తొలి జయంతి ఉత్సవాలు
వైభవంగా నిర్వహణకు
టీటీడీ, జిల్లా యంత్రాంగం సన్నద్ధం
మే 6 నుంచి 12 వరకు నిర్వహణ
రాజంపేట ఎమ్మెల్యే మేడాతో
్లపర్యాటక అధికారుల బృందం భేటీ