
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
ధ్వజారోహణం చేస్తున్న వేదపండితులు
గజవాహనంపై ఊరేగుతున్న పట్టాభిరాముడు
పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వాల్మీకిపురం : వాల్మీకిపురంలోని పట్టాభిరామస్వామి ఆలయంలో సోమవారం శోభకృత్‌నామ సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6గంటల నుంచి 7 గంటల మధ్య ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి ఆగమ పండితులు మణికంఠ భట్టార్, అర్చకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు, టీటీడీ వేదపండితులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా నాగదోష, సంతాన ప్రాప్తి కోసం మహిళలకు కొడి ప్రసాదం పంపిణీ చేశారు. ఉదయం శ్రీ సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాములవారి ఉత్సవమూర్తులును విశేష అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం ఊంజల్‌సేవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, ఏఈఓ గురుమూర్తి, సూపరింటెండెంట్ మునిచెంగల్‌రాయులు, ఆలయ అధికారి కృష్ణమూర్తి, దిశంత్ కుమార్, నాగరాజు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
గజవాహనంపై పట్టాభిరాముడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు పట్టాభిరాముడు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు గజవాహనంపై తిరుమాఢ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. కోలాటాలు, చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టాభిరామస్వామి గజవాహనంపై ఊరేగారు. వాహనాల ఎదుట మహిళలు పిండిదీపాలతో స్వాగతం పలికారు. భక్తులు అడుగడుగునా కొబ్బరికాయలు కొడుతూ... కర్పూర హారతులతో స్వామిని సేవించుకున్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ము త్యపుపందిరి వాహనం, సాయంత్రం ఊంజల్‌సేవ, రా త్రి హనుమంత వాహనం సేవ నిర్వహించనున్నారు.
