
మృతి చెందిన విద్యార్థి పండు
మదనపల్లె : సెలవు రోజున సరదాగా స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని కృష్ణానగర్‌కు చెందిన నిమ్మ మహేష్, రాణి దంపతుల కుమారుడు ఎన్.పండు(13) స్థానిక జెడ్పీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవుదినం కావడంతో స్నేహితులతో కలిసి మండలంలోని కోళ్లబైలు పంచాయతీ మామిడిగుంపులవారిపల్లె సమీపంలోని చెరువు వద్దకు ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా జేసీబీతో తీసిన లోతైన గుంతల్లో స్నేహితులు ఈత కొడుతుండగా, తనకు ఈత రాకపోవడంతో గట్టు పట్టుకుని ఈత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు నీట మునిగాడు. గమనించిన స్నేహితులు గట్టుకు వచ్చి ప్రమాద విషయాన్ని స్థానికులకు తెలపడంతో కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే పండు నీట మునిగిపోవడంతో మృతదేహాన్ని వెలుపలికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తల్లిదండ్రులు బోరున ఏడుస్తూ... ‘ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క మగ సంతానాన్ని అల్లారుముద్దుగా పెంచుకుంటే అనాథలను చేసి వెళ్లిపోయావా బిడ్డా’ అంటూ విలపించడం స్థానికులను కలిచివేసింది. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులకు సమాచారం అందించారు.
ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

రోదిస్తున్న తల్లి, కుటుంబ సభ్యులు