
విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్ ఆకేపాటి
ఒంటిమిట్ట : మండల పరిధిలోని రాచపల్లె గ్రామంలో కొండూరు సరోజనమ్మ, కొండూరు జయరామరాజు జ్యేష్ట పుత్రుడు అమర వీర జవాన్ లాన్స్‌నాయక్ కొండూరు యుగంధర్ విగ్రహాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, బెంగళూరుకు చెందిన సతీష్‌కుమార్ ఆవిష్కరించి, భారత మిలటరీ పద్ధతిలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశం కోసం ప్రాణాలు వదిలిన వీర జవాన్ లాన్స్‌నాయక్ కొండూరు యుగంధర్ దేశం గర్వించదగ్గ వ్యక్తి అని, తాను ఎంచుకున్న మార్గంలో తన ప్రాణాలను కూడా లెక్క చేయని వ్యక్తి అని కొనియాడారు. ఆయన భావితరాలకు ఆదర్శమూర్తి అన్నారు. అనంతరం బెంగళూరుకు చెందిన సతీష్ కుమార్ మాట్లాడుతూ 2003లో 6932 మీటర్లు గల కై లాస పర్వతం అధిరోహించి అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహస అవార్డు అందుకున్నారని తెలిపారు. 2005లో 7138 మీటర్ల గల చాకుంభా–1 పీక్ అనే ఎత్తయిన శిఖరాన్ని అధిరోహిస్తూ భారత జాతి కీర్తిని హిమ శిఖరాలకు చేర్చే క్రమంలో కొండ చరియలు విరిగిపడి వీరమరణం చెందాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, ఎం. ఓబులేసు, బి.కృష్ణయ్య, శేఖర్, శ్రీనివాసులరెడ్డి, చండ్రాయుడు, స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
దంపతులపై దాడి
మదనపల్లె : చేపల చెరువు వద్ద జరిగిన ఘర్షణలో కొందరు వ్యక్తులు దంపతులపై దాడికి పాల్పడిన సంఘటన వాల్మీకిపురం మండలంలో జరిగింది. నగిరిమడుగు పంచాయతీ చిన్ననారాయణపల్లెకు చెందిన దంపతులు రమణయ్య (50), రమాదేవి (45) వ్యవ సాయం చేసుకుని జీవిస్తున్నారు. రమణయ్య కుమారుడు నాగరాజ గ్రామ సమీపంలోని ఓ చెరువులో ఆదివారం చేపలు పడుతుండగా, అదే గ్రామానికి చెందిన రఘు, శీన ఘర్షణకు దిగారు. ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అయితే కుమారుడు నాగరాజుకు అడ్డుగా వెళ్లిన దంపతులు రమణయ్య, రమాదేవిపై రఘు, శీన, వెంకటరమణ, అన్నయ్య, లక్ష్మీదేవి కర్రలతో దాడి చేసి గాయపరిచారు. బాధితులను 108 అంబులెన్స్‌లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.