
పౌరాణిక నాటకంలోని ఓ దృశ్యం (ఫైల్)
కడప కల్చరల్ : సురభి పుట్టిన జిల్లాలో నాటకం కొడిగడుతున్న దీపంలా కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు ఎంతో వైభవంగా చూసిన ఈ నేలపై.. నాటకం ఆనవాళ్లు క్రమంగా కనుమరుగవుతున్నాయి. భావితరాలు ఈ రంగం వైపు వచ్చే అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో ప్రస్తుతం నాటకరంగం తీరుతెన్నులపై ప్రత్యేక కథనం.
ప్రస్తుతం రంగస్థల నాటకం దయనీయ స్థితిలో ఉంది. ఒకప్పుడు 30కి పైగా నాటక సంస్థలు ప్రతి మాసం ప్రదర్శనలిస్తూ ఉండేవి. కడప నగరంతోపాటు రాజంపేట, నందలూరు, ప్రొద్దుటూరు, రాయచోటిలలో తరుచూ ప్రదర్శనలు జరుగుతుండేవి. ప్రస్తుతం రెగ్యులర్‌గా నాటకాలు ప్రదర్శించే సంస్థలు లేవనే చెప్పక తప్పదు. నాడు కడపలో పాత రంగస్థలంతోపాటు చెన్నూరు బస్టాండు వద్ద రామకృష్ణ సమాజం, పాత బస్టాండులోని ఎన్జీఓ హోం, అప్పుడప్పుడు కడప నగరంలోని సీఎస్‌ఐ హైస్కూలు కూడా నాటక ప్రదర్శనలకు వేదికలుగా విలసిల్లాయి. పలు నాటక సంస్థలు కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా పలుమార్లు నాటక పరిషత్తులను కూడా నిర్వహించాయి. దాదాపు 30కి పైగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక నంది అవార్డులు, టీటీడీ గరుడ అవార్డులను సాధించాయి. కానీ నేడు ఈ వేదికలన్నీ నాటకానికి దూరమయ్యాయి. సినిమాలను తట్టుకుని నిలిచిన నాటకరంగం టీవీల దెబ్బకు కళ తప్పిందని పలువురు పేర్కొంటున్నారు. పౌరాణికంలో రిహార్సల్స్ తక్కువ గనుక టీవీ పోటీని కూడా తట్టుకుని నిలబడగలిగింది. నేటికీ గ్రామాల్లో గాత్ర శుద్ధిగల యువతతోపాటు వృద్ధులు కూడా పౌరాణిక నాటకాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఉర్దూ నాటకానికి ‘పరదా’
జిల్లాలో ఉర్దూ నాటకం కూడా క్రమంగా కనుమరుగైంది. ఏటా రెండు, మూడుసార్లు ప్రదర్శించిన ఉర్దూ నాటకం ఇప్పుడు రెండు, మూడేళ్లకు ఒకటి కూడా కనిపించడం లేదు. అభిరుచిగల కళాకారులు కనుమరుగు కావడం, అభినివేశం గల వారు వృద్ధులు కావడం, కొత్త తరం ఇటువైపు చూడకపోవడంతో ఉర్దూ నాటకానికి పరదా పడింది. ముఖ్యంగా కడప నగరంలో ప్రముఖ ఉర్దూ కవి, రచయిత యూసఫ్ సఫీ తన నాటక రచన, ప్రదర్శనలతో సహచరులను ఎప్పటికప్పుడు ఉత్తేజ పరిచేవారు. ఆయన గతించడంతో ఉర్దూ నాటకం అక్కడే ఆగిపోయింది.
ఉన్నా లేనట్లే!
నాటకం వేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే వారికి రంగ స్థలాలు దొరకడం కష్టమైంది. నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రాన్ని లక్షలాది రూపాయలతో ఆధునికీకరించినా అద్దె ఎక్కువ అంటూ కళాకారులు ఆ వైపు రావడం లేదు. తప్పనిసరి అయితే బ్రౌన్ గ్రంథాలయాన్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో కళాక్షేత్రం నిర్వహణ కూడా బరువుగా మారింది. వైఎస్సార్ పేరిట నిర్మించిన ఆడిటోరియంలో నాటకం ప్రదర్శించి రెండు, మూడేళ్లు కావస్తోంది. ప్రొద్దుటూరులో కూడా ఇటీవల నాటకం జాడలేదు. రాజంపేట, నందలూరు, బద్వేలు, ఇతర పట్టణాలలో కూడా పరిస్థితి అలాగే ఉంది.
ఆశావహ స్థితి
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యోగి వేమన విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగం ప్రత్యేకించి రంగస్థల కళల విభాగం ఈ రంగంపై ఆశలను సజీవంగా ఉంచుతోంది. ఇప్పటికి దాదాపు 10 నాటికలు, నాటకాలను ఆ విభాగ విద్యార్థులు ప్రశంసనీయంగా ప్రదర్శించారు. ఈ కోర్సులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. ఇటీవల నృత్యం, సంగీతం విభాగాలను కూడా ఏర్పాటు చేసి నగర వాసుల కోసం నగరంలోని కళాశాలల్లో శిక్షణ అందుబాటులోకి రావడంతో నాటక విభాగానికి కూడా ఆదరణ పెరుగుతోంది. యునైటెడ్ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇటీవల ఉన్నత విద్యా సంస్థల్లో కళారూపాల శిక్షణను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం, ఈ దశలో నాటకం పట్ల కొత్త ఆశలను రేపుతోంది.
కొడిగడుతున్న నాటక దీపం
నేడు ప్రపంచ రంగస్థల దినోత్సవం
సహకారం కావాలి
కళల అభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహం, ముఖ్యంగా ఆర్థిక ప్రోత్సాహం అవసరం. ఇది వృత్తిగా లాభించదన్న అభిప్రాయంతో యువత ముందుకు రావడం లేదు. ఆర్థిక ప్రోత్సాహం ఉన్నప్పుడే రచయితలు, దర్శకులు, నటుల్లో కూడా ఆసక్తి పెరుగుతుంది. నాటకం మనుగడ సాగిస్తుంది. వైవీయూలో నాటక రంగ విభాగానికి ఊహించనంత డిమాండ్ ఏర్పడటంతో దీనికి మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకం పెరిగింది.
– ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి,
రంగస్థల కళల విభాగం, వైవీయూ, కడప
