దెబ్బమీద దెబ్బ

రాజంపేటరూరల్‌: ఆకేపాడులో  నేలకొరిగిన అరటి  - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన తేమ గాలుల ప్రభావంతో అన్నమయ్య జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాత కుదైలైపోయాడు. కళ్ల ముందు పచ్చగా కనిపిస్తున్న పంట వడగండ్ల వర్షం దెబ్బకు నేల రాలిపోవడంతో దిక్కుతోచక ఆందోళనకు లోనవుతున్నాడు. మొదటి రెండు రోజులు మదనపల్లి డివిజన్‌ పరిధిలో వడగళ్ల వర్షం, ఈదురు గాలులతో పండ్లతోటలు భారీ స్థాయిలో దెబ్బతిన్నాయి. శనివారం రాత్రి కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా మామిడి, బొప్పాయి, అరటి, టమాటా, వరి, ప్రొద్దు తిరుగుడు తదితర పంటలు దెబ్బతిని రైతులకు నష్టాన్ని చేకూర్చాయి. జిల్లాలో 501.18 ఎకరాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నట్లు జిల్లా ఉద్యానవన అధికారి చంద్రబాబు తెలిపారు. అలాగే పొద్దుతిరుగుడు 31.2 హెక్టార్లు, వరి, నువ్వులు, జొన్న తదితర పంటలు 30.2 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. అన్నమయ్య జిల్లా పరిధిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సుమారు 6 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. శనివారం రాత్రి జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షం కురిసింది.

● గాలులతో కురిసిన వర్షానికి రాజంపేట రూరల్‌ మండలంలో 50 మంది రైతులకు చెందిన 153 ఎకరాల అరటిపంట నేలకొరిగింది. దాదాపు రూ. 1.50 కోట్లకుపైగా నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖాధికారులు అంచనా వేస్తున్నారు. 5 ఎకరాలలో కూరగాయల తోటలు, 5 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట దెబ్బతింది. మండల పరిధిలోని హస్తవరం, పెద్దకారంపల్లి, ఆకేపాడు, మిట్టమీదపల్లి, బ్రాహ్మణపల్లి, గుండ్లూరు పంచాయతీల పరిధిలో అరటితోలు నెలకొరిగాయి.

● చిట్వేలి మండలంలోని కెఎస్‌ అగ్రహారంలో 15 , రాజుకుంటలో 2 ఎకరాలు, నగిరిపాడులో 2 ఎకరాలు, దేవమాచుపల్లిలో 4 ఎకరాల్లో అరటి, మాలేమార్పురంలో 20 ఎకరాల్లో మొక్కజొన్న, 7 ఎకరాల్లో కర్బూజ పంటలు ధ్వంసమయ్యాయి. వ్యవసాయ సహాయకులు శ్రీరామ్‌, కళ్యాణి,పావని, నరసింహులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము పంటలను పరిశీలించి ప్రాథమి అంచనా చేశామని, ఈ సమాచారాన్ని తహశీల్దార్‌ దృష్టికి తీసుకెళ్ళి ఉన్నతాధికారులకు నివేదించి రైతులకు నష్టపరిహారం మంజూరుకు కృషి చేస్తామన్నారు.

● గుర్రంకొండ మండలంలో శనివారం రాత్రి వడగండ్ల వర్షం కురిసింది. దీంతో మండలం మొత్తం 120 ఎకరాల్లో మామిడితోటలు, 450 ఎకరాల్లో టమాటా,25ఎకరాల్లొ పూలతోటలు, 15 ఎకరాల్లొ కర్బూజా తోటలు దెబ్బతిన్నాయి. గంగిరెడ్డిపల్లెలో కాపునకు వచ్చిన మామిడికాయలు గాలులకు రాలిపోయాయి.

● తంబళ్లపల్లె మండలం రెడ్డికోట పంచాయతీ మేకలవాండ్లపల్లెలో దోస, టామాటా పంటలు దెబ్బతిన్నాయి.

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top