చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు | YSRCP Chief YS Jagan Slams AP Police Systems Functioning: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం... రాజకీయ ఆయుధంలా పోలీసులను వాడుకుంటున్నారు

May 9 2026 4:46 AM | Updated on May 9 2026 6:54 AM

YSRCP Chief YS Jagan Slams AP Police Systems Functioning: Andhra Pradesh

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపాటు

ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించేందుకు పోలీసులను ప్రయోగిస్తున్నారు 

బాబు వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా సోషల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌  

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తున్నారు 

విమర్శను సైతం నేరంగా పరిగణించే పరిస్థితి.. ఏపీలో ప్రమాదంలో రాజ్యాంగ స్ఫూర్తి..  

పోలీస్‌ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో వ్యవహరిస్తోంది

కోర్టులు పలు సందర్భాల్లో తప్పుబట్టినా లెక్క చేయకుండా పూర్తి ఏకపక్షంగా చట్ట విరుద్ధంగా కేసులు నమోదు చేస్తున్నారు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..  

రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం
ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్‌ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.

టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్‌ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. 

టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం
ప్రభుత్వ బరితెగింపు ఇప్పుడు మరింత ఎక్కువై పరిధి దాటుతోంది. వారి ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను నిలదీస్తూ అందుకు బాధ్యులైన అధికార పార్టీ నాయకులపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టినా, అలాంటి వాటిని ఫార్వర్డ్‌ చేసినా ఏమాత్రం సహించలేకపోతున్నారు. వెంటనే వారి పార్టీ నాయకులు, మద్దతుదారులతో ఫిర్యాదు చేయిస్తున్నారు. ఆ ఫిర్యాదులు రావడమే ఆలస్యం అన్నట్లుగా పోలీసులు శరవేగంగా స్పందిస్తున్నారు. కోర్టులు అనేక సందర్భాల్లో తప్పుబట్టినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పూర్తి ఏకపక్షంగా కక్ష సాధింపుతో చట్ట విరుద్ధంగా పలు సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారు.  

పోలీస్‌ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి
అధికార టీడీపీ తమ సామాజిక మాధ్యమ వేదికల ద్వారా రోజూ వైఎస్సార్‌సీపీ నేతలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలపై విషం చిమ్ముతూ, విష ప్రచారం చేస్తూ దూషణలతో కూడిన దారుణ పోస్టులు పెడుతోంది. నిత్యం వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేస్తోంది. వాటిపై విపక్ష వైఎస్సార్‌సీపీ ఎన్ని ఫిర్యాదులు చేసినా, పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. సాక్ష్యాధారాలు చూపినా కనీసం కేసు నమోదు చేయడం లేదు. ఎఫ్‌ఐఆర్‌ల ఊసే లేదు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ బాధ్యత మర్చిపోయి ద్వంద్వ ప్రమాణాలతో హేయంగా వ్యవహరిస్తోంది. ఇది కచ్చితంగా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తిపైనే దాడిగా భావించాల్సి వస్తోంది.

స్వేచ్ఛ స్థానంలో భయం.. జవాబుదారీతనం స్థానంలో బెదిరింపులు.. పోలీసు యంత్రాంగం, వ్యవస్థ రాజకీయ ఆయుధంగా మారడం.. ఒక విమర్శను నేరంగా పరిగణించే పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉనికిపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడ కష్టం. హేయమైన చర్యలు, అణచివేత ధోరణి, రాజకీయ కక్ష సాధింపులు.. వెరసి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార దుర్వినియోగానికి పాల్పడటం.. పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఆ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేలా వ్యవహరించడం.. ప్రతిపక్షం గొంతు నొక్కడమే లక్ష్యంగా పని చేయడం.. సోషల్‌ మీడియాపై నియంత్రణ.. అసమ్మతిని అణచి వేయడం లాంటి చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తున్నాం.

సోషల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌
టీడీపీ కూటమి ప్రభుత్వ అధికార దుర్వినియోగం అంతటితో ఆగిపోవడం లేదు. వారి పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ, వారి తప్పులను ఎండగడుతూ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన అంశాలను (కంటెంట్‌) తొలగించాలని, వారి ఖాతాలను బ్లాక్‌ చేయడం లేదా సస్పెండ్‌ చేయాలని ఆదేశిస్తున్నారు. ఆ మేరకు పోలీసు శాఖ స్వయంగా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు పంపిస్తోంది.

ఆ విధంగా వ్యవస్థీకృతంగా సోషల్‌ మీడియాపై సెన్సార్‌షిప్‌ విధిస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిపై ప్రజల్లో చర్చ జరగకుండా చూడడం.. ఎక్కడా అసమ్మతి గళం వినిపించకుండా ప్రయత్నించడం..  భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే దిశలో టీడీపీ కూటమి ప్రభుత్వం పోలీస్‌ యంత్రాంగాన్ని ఏ స్థాయిలో వాడుకుంటుందో చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం. బాధ్యత, జవాబుదారీతనం లేకపోవడం, విమర్శలను సహించలేకపోవడం, పారదర్శకత లోపించడం వల్ల ఏర్పడిన అభద్రతా భావంతో పెల్లుబుకుతున్న అసహనం.. దానివల్ల కక్షపూ­రిత, నిరంకుశ విధానాలను ప్రభుత్వ చర్యలు తేటతెల్లం చేస్తున్నాయి.  

Advertisement
 
Advertisement
Advertisement