
సాధారణ ప్రజలకు మేలు
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దేశంలో జీఎస్టీ (వస్తు సేవల పన్ను) కొత్త శ్లాబులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. జీఎస్టీ సంస్కరణలు సరళమైన, పారదర్శకమైన పన్ను వ్యవస్థ దిశగా వేసిన విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. దీనివల్ల సాధారణ ప్రజలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ‘ఎక్స్’లోని తన ఖాతాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోస్టు చేశారు. ‘జీఎస్టీ సంస్కరణలు సరళమైన పారదర్శకమైన పన్ను వ్యవస్థ దిశగా వేసిన విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు దోహదపడతాయి. ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదుల నిర్వహణలో లోపాలు ఉండవచ్చు. కానీ ఇది ఒక ప్రక్రియ. దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని ఆశిస్తున్నాను. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి.. మరింత పెట్టుబడులకు అవసరమైన పోత్సాహాన్ని ఇస్తుంది’ అంటూ పేర్కొన్నారు.