World Urdu Day 2021: ఉర్దూ విద్యకు ఊతం

World Urdu Day Special: MA Urdu Course Regularised In Yogi Vemana University - Sakshi

నేడు అంతర్జాతీయ ఉర్దూ దినోత్సవం

వైవీయూలో రెగ్యులర్‌ కోర్సుగా ఎంఏ ఉర్దూ

జిల్లా వ్యాప్తంగా వేలసంఖ్యలో విద్యార్థులు ఉర్దూ విద్యను అభ్యసిస్తున్నారు. వీరు డిగ్రీ అనంతరం వీరికి పీజీ చేయాలంటే హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే వైఎస్‌ఆర్‌ ముందుచూపుతో విశ్వవిద్యాలయంలో ఎంఏ ఉర్దూ కోర్సుకు అడుగులు పడగా.. ప్రస్తుత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం, వీసీ చొరవతో ఎంఏ కోర్సును రెగ్యులర్‌గా మార్పు చేసి సాధారణ ఫీజులతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతర్జాతీయ ఉర్దూ భాషా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం..

వైవీయూ : రాయలసీమ జిల్లాలకు నడిబొడ్డుగా ఉన్న కడప యోగివేమన విశ్వవిద్యాలయం ఉర్దూ విద్యకు ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది జాతీయ విద్యాదినోత్సవం, జాతీయ మైనార్టీ దినోత్సవం పురస్కరించుకుని వైవీయూలో ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్‌ కోర్సుగా మార్పు చేస్తూ వైవీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి ప్రకటించారు. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉర్దూ విద్యార్థులు ఉన్నతవిద్యను పొందాలన్న  కల నెరవేరింది.

వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సూచనతో అప్పటి వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి ఎంఏ ఉర్దూ కోర్సుకు సంబంధించిన ప్రతిపాదనలను 2009లో తీసుకొచ్చారు. వైఎస్‌ఆర్‌ మరణానంతరం ఈ  కోర్సు సంగతి అటకెక్కింది. అయితే దీనిపై గతంలో సాక్షిలో ‘ఉర్దూ విద్య.. మిధ్య’ అన్న శీర్సికతో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన అప్పటి వీసీ ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి 2017–18 విద్యాసంవత్సరానికి గాను ఎంఏ కోర్సును ప్రవేశపెట్టారు. అయితే దీనిని సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుగా ప్రవేశపెట్టడం, ఫీజులు ఎక్కువ కావడంతో ఉర్దూ విద్యను అభ్యసించే విద్యార్థులకు భారంగా మారింది.

2020 జనవరిలో బాధ్యతలు స్వీకరించిన వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య మునగాల సూర్యకళావతి దృష్టికి  ఉర్దూ మేధావులు సమస్యను తీసుకెళ్లారు. ఆమె వెంటనే స్పందించి పాలకమండలిలో ఉంచి రెగ్యులర్‌ కోర్సుగా మార్పు చేస్తూ  తీర్మానించింది. అనంతరం ఎంఏ ఉర్దూ కోర్సును రెగ్యులర్‌ చేయడంతో పాటు కోర్సుకు సంబంధించిన రెగ్యులర్‌ పోస్టులు మంజూరు విషయమై ఏపీ ఉన్నతవిద్యామండలి దృష్టికి తీసుకెళ్లారు.

అభివృద్ధి దిశగా ఉర్దూ విభాగం..
విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం విభాగాధిపతిగా ఆచార్య పి.ఎస్‌. షావల్లీఖాన్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విభాగంలో పలు అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా లాంగ్వేజ్‌ ల్యాబ్, గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు  అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చారు. దీంతో పాటు పనిచేస్తున్న అధ్యాపకులు, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా జాతీయస్థాయిలో పేరొందిన ఉర్దూ కవులు, రచయితలు, ప్రముఖులతో వెబినార్‌లు నిర్వహించి మరింత ప్రాభవం కల్పించారు. కాగా ఉర్దూ కోర్సులో ప్రస్తుతం అందరూ అకడమిక్‌ కన్సల్టెంట్‌లు మాత్రమే బోధన చేస్తున్నారు. కోర్సును రెగ్యులర్‌ చేసినప్పటికీ పోస్టులను రెగ్యులర్‌ చేయాలని అక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు కోరుతున్నారు. దీంతో పాటు పరిశోధనలు చేసేందుకు అవసరమైన గైడ్‌షిప్‌ ఇవ్వాలని వారు కోరుతున్నారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top