ఫిబ్రవరిలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరిలో ప్రపంచ పెట్టుబడుల సదస్సు

Published Sun, Sep 18 2022 6:40 AM

World Investment Summit in February Andhra Pradesh - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు వీలుగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ వేదికగా ‘ప్రపంచ పెట్టుబడుల సదస్సు’ నిర్వహించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని శనివారం విశాఖపట్నంలోని ఒక హోటల్‌లో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల సదస్సును రెండేళ్ల క్రితమే నిర్వహించాలని భావించినప్పటికీ కోవిడ్‌ పరిస్థితుల కారణంగా వాయిదా పడిందన్నారు. ప్రస్తుతం అనుకూలంగా ఉండడంతో సదస్సును వచ్చే ఏడాది నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు.

రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లు ఇక్కడున్న పారిశ్రామికవేత్తలేనని సీఎం చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేయాలన్నా.. రాష్ట్ర భవిష్యత్తు మార్చాలన్నా పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉందని మంత్రి తెలిపారు. ఇక పరిశ్రమల సమస్యలపై చాంబర్‌ సభ్యులను సీఎం దగ్గరకు తీసుకువెళ్లి వాటి పరిష్కరానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.  

మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం 
ఇక మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు త్వరలో మహిళా పారిశ్రామికవేత్తల పార్కును ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమర్‌నాథ్‌ చెప్పారు. డిమాండ్‌ ఆధారంగా ఇతర జిల్లాల్లో కూడా వీటి ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.

సమావేశంలో గౌరవ అతిథి, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగుభాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు కృషిచేసిన వారిలో అనేకమంది మహనీయులుంటే.. ఆ జాబితాలో వైఎస్సార్‌తో పాటు ఆయన తనయుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఉన్నారన్నారు.

ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రాష్ట్ర అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి, పరిశ్రమలకు వారథిగా వాణిజ్య మండలి ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ ఎదుర్కొంటున్న సమస్యలను ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు (ఎలక్టెడ్‌) భాస్కరరావు వివరించారు. చిన్న పరిశ్రమలపై అధిక భారం పడుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం మరింత సహాయం అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కోశాధికారి ఎస్‌.అక్కయనాయుడు, పెద్దఎత్తున పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement