జనంలేక పాడుబడ్డ ఊరు: రోజూ వచ్చి వెళ్తున్న వృద్ధుడు

Village wreckaged But It Available In Revenue Record At Chittoor District - Sakshi

చిత్తూరు: పాపాఘ్ని నది సమీపంలో ఉండే ఊరు ఒకప్పుడు జనాలతో, పంటలతో కళకళలాడేది. ఆ ఊరి పేరు పుట్టాపర్తి. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో ఉంది. కొన్నేళ్ల నుంచి నదిలో నీరులేక, బోరు బావుల్లో నీరు రాక.. పంటలు పండక ఊరు ఖాళీ అయిపోయింది. ఇక్కడ జీవించిన వారు సమీప గ్రామాలకు, బెంగళూరుకు పనుల కోసం వలస వెళ్లిపోయారు. దీంతో ఇళ్లన్నీ శిథిలమైపోయాయి. జనం లేకపోయినా ఊరి పేరు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో మిగిలిపోయింది. అయితే బక్కోళ్ల కిట్టన్న అనే 70 ఏళ్ల వృద్ధుడు మాత్రం ప్రతిరోజు ఊరికి వచ్చి వెళుతూ ఉంటాడు. పగలంతా తన వ్యవసాయ భూమిలో ఉన్న షెడ్డులో కాలక్షేపం చేసి సాయంత్రం తాను నివసిస్తున్న టి.సదుం గ్రామానికి చేరుకుంటున్నాడు. ఎందుకు వెళ్తావు ఆ ఊరికి అని అడిగితే.. చిన్న నాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి అని కిట్టన్న బదులిస్తాడు.

ఊరి పేరు ఎలా వచ్చిందంటే.. 
టి.సదుంలో ఒకప్పుడు కలరా వ్యాధి ప్రబలడంతో ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఈ మహమ్మారి నుంచి తప్పించుకోవడానికి కొంతమంది పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న ప్రాంతంలో నివసించడానికి వెళ్లారు. ఆ ఖాళీ స్థలంలో గుడిసెలు, రాతి సుద్ద మిద్దెలు కట్టుకోవడంతో అదో ఊరిగా మారింది. అక్కడ నాగుల పుట్టలు, చెదలు పుట్టలు అధికంగా ఉండటంతో ఆ ఊరికి పుట్టాపర్తిగా నామకరణం చేశారు. 

శివరాత్రి ఉత్సవాలు ప్రత్యేకత.. 
పాపాఘ్ని నది ఒడ్డున శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ ఏటా శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవ ప్రతిమలను పుట్టాపర్తికి తీసుకెళ్లడం.. అనంతరం టి.సదుం గ్రామానికి తీసుకెళ్లడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు పుట్టాపర్తిలో ఎవరూ లేకపోవడంతో ఉత్సవ ప్రతిమలను నేరుగా టి.సదుంకు తీసుకెళ్లిపోతున్నారు. పాపాఘ్ని నదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నపుడు కపిల్‌ (ఎద్దులతో తిప్పే యంత్రం) ద్వారా నీళ్లు తోడి పంటలు సాగు చేసేవారమని, పచ్చటి పొలాలతో ఊరు కళకళలాడేదని కిట్టన్న చెప్పాడు.

ఏడేళ్ల వయసు వరకు ఇక్కడే.. 
నాకు ఏడేళ్ల వయసు వచ్చే వరకూ ఊళ్లోనే ఉన్నా. పాపాఘ్ని నది దాటి టి.సదుంలో ఉన్న పాఠశాలకు వెళ్లేవాడిని. ఒకసారి నదిలో నీటి ప్రవాహం అధికం కావడంతో ఇంటికి రాలేక పోయాను. ఇప్పుడు టి.సదుంలోనే ఉంటున్నాను.  
– బోడెన్నగారి ఆదెన్న  

నీరు తగ్గే వరకూ అక్కడే.. 
పాపాఘ్ని నదిలోకి నీరు వస్తే మూడు రోజుల వరకూ ప్రవాహం తగ్గేది కాదు. పని మీద బయటకు వెళ్తే అక్కడే ఉండేవాళ్లం. ఊళ్లో పండుగలు, పబ్బాలు గొప్పగా చేసుకునేవాళ్లం. పగలంతా గత అనుభవాలు గుర్తుచేసుకుంటూ ఇక్కడే కాలక్షేపం చేసి రాత్రికి టి.సదుం చేరుకుంటాను.  
– బక్కోళ్ల కిట్టన్న 

చదవండి: నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top