ఏటా రూ.150 కోట్ల వ్యాపార లావాదేవీలు 

Venkatagiri Zari Sarees Famous International Market - Sakshi

వెంకటగిరి.. చేనేత జరీ చీరలను చూస్తే మగువల మనస్సులు పురివిప్పుతాయి. మేను పులికించిపోతోంది. సంప్రదాయం, ఆధునీకత కలబోతల వర్ణ రంజితమైన చేనేతల అద్భుత కళాఖండాలు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి జరీ చీరలు దేశీయంగా మార్కెట్‌లో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం, సరైన మార్కెటింగ్‌ లేకపోవడంతో ఈ రంగం దశాబ్దాల కాలంగా చతికిల పడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం లభించనుంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకానికి వెంకటగిరి జరీ చీరలు ఎంపికయ్యాయి.

సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి జరీ, పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. జిల్లాలోనే కాకుండా దేశీయంగా పలు రాష్ట్రాల్లోని బ్రాండెడ్‌ షోరూమ్స్‌లకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చీరల ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానికంగానూ ఏటా రూ.కోట్ల రిటైల్‌ వ్యాపారం జరుగుతోంది.  

  • వెండి జరీ, ఆఫ్‌ఫైన్‌ జరీతో వివిధ రకాల డిజైన్లతో ఇక్కడ చీరలు నేస్తున్నారు.  
  • ఎంతో నైపుణ్యంతో చీరను నేయడంతో మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెంకటగిరి చీరలకు భలే డిమాండ్‌ ఉంది.  
  • విదేశీ మహిళలు సైతం వెంకటగిరి చీరలపై మోజు పెంచుకుంటున్నారు.  
  • ఆధునిక డిజైన్లతో చీరలను నేస్తుండడంతో వెంకటగిరి చీరలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయి.  
  • వెంకటగిరి చీరల్లో జిందానీ వర్క్‌కు మంచి డిమాండ్‌ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్‌ కనబడడం జాందనీ వర్క్‌ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యత మరెక్కడా కనపడదు.  
  • విశిష్ట మహిళలకు వెంకటగిరి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్‌గా మారింది.     
  • మార్కెట్‌ సౌకర్యం విస్తృతం  
  • మగువలకు అందాన్నిచ్చే వెంకటగిరి జరీ చీరలకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది.    
  • జిల్లా, రాష్ట్రీయంగానే కాక దేశీయంగానూ మార్కెట్‌లో వెంకటగిరి చీరలకు డిమాండ్‌ ఉండడంతో ఏటా రూ.150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. 
  • అంతర్జాతీయ మార్కెట్‌కు సౌకర్యం లభిస్తే విక్రయాలు పెరిగి, రెట్టింపు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్థానిక మాస్టర్‌ వీవర్లు, నేత కార్మికుల అంచనా.   
  •  చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్‌ నేతన నేస్తం’ పథకం అమలు చేసి ఇప్పటికే రెండు దఫాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. 
  • చేనేతకు మరింత లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ రంగంలోని యువతను ప్రోత్సహించి, ఎగుమతిదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. 
  • అంతర్జాతీయ మార్కెట్లో వెంకటగిరి చీరల విక్రయానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కల్పించింది.  
  • స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ వసతికి మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకం’ ద్వారా జిల్లా నుంచి వెంకటగిరి జరీ చీరలను ఎంపిక చేశారు.  
  • చేనేత కార్మికులున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత చీరలు, గుంటూరు జిల్లా మంగళగిరి నేత కార్మికులు తయారు చేసే చీరలు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జిందానీ చీరలను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. 
  • ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ఇవ్వనుంది.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top