Darshit: కన్నా..ఇక కనిపించవా..

Three Year Darshit deceased with Electrocution at Kakinada District - Sakshi

విద్యుదాఘాతంతో బాలుడికి తీవ్రగాయాలు 

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన మూడేళ్ల దర్శిత్‌ 

కాపాడేందుకు వైద్యుల విఫలయత్నం

పరామర్శించిన హోం మంత్రి వనిత

సాక్షి, తాళ్లపూడి/కాకినాడ క్రైం: మూడేళ్ల దర్శిత్‌ విషాదాంతం అందరి హృదయాలను కలచివేసింది. మండలంలోని పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి వినోద్‌కుమార్‌ కుమారుడైన దర్శిత్‌  (3) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 12న తమ ఇంటి డాబాపై ఆడుకుంటుండగా, పై నుంచి వెళుతున్న విద్యుత్‌ వైర్లు తగిలి బాలుడు షాక్‌కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబును కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలుడి కాళ్లకు ఇన్పెక్షన్‌ సోకడంతో ఆపరేషన్‌ చేసి రెండు కాళ్లనూ తొలగించాల్సి వచ్చింది.

ఈ సంఘటన అందరి గుండెలనూ పిండేసింది. బాలుడ్ని కాపాడేందుకు జీజీహెచ్‌ వైద్యుల బృందం చేయని ప్రయత్నం లేదు. మరోపక్క దాతలూ స్పందించారు. పెద్ద మనసుతో ఆర్థిక  సహాయం అందించారు. పలు శాఖల అధికారుల తమ ఉదారతను చాటుకున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు రెండు వారాల  పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి దర్శిత్‌   శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. బాలుడి మృతితో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.  జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడైన అక్షిత్‌ యూకేజీ చదువుతున్నాడు. దర్శిత్‌  రెండో కుమారుడు. వినోద్‌ లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే)

హోం మంత్రి వనిత పరామర్శ 
శుక్రవారం ఉదయం హోంమంత్రి తానేటి వనిత కాకినాడ జీజీహెచ్‌కు వెళ్లి ఆర్‌ఐసీయూలో దర్శిత్‌ను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించినట్లు తెలిపారు. బాలుడ్ని రక్షించేందుకు పీడియాట్రిక్స్, పీడియాట్రిక్‌ సర్జరీ, ప్లాస్టిక్‌ సర్జరీ, అనస్థీయా నిపుణులు శ్రమించారని వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

కుమారుడ్ని కాపాడాలంటూ రోదించిన దర్శిత్‌ తల్లి చాందినిని హోం మంత్రి అక్కున చేర్చుకొని ఓదార్చారు.  ఆర్‌ఐసీయూలో బాలుడికి అందుతున్న చికిత్సను  హోం మంత్రి తానేటి వనతి, కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎంపీ గీత, కౌడా ఛైర్మన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర మాజీ మేయర్‌ సుంకర శివప్రసన్న పరిశీలించారు. సాయంత్రానికే బాబు మరణించాడనే దుర్వార్త మనసున్నవారిని కుదిపేసింది. బాలుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూసి అందరూ చలించిపోయారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top