కాకినాడ జీజీహెచ్‌లో కీచకులు | Medical students molested in Kakinada GGH | Sakshi
Sakshi News home page

కాకినాడ జీజీహెచ్‌లో కీచకులు

Jul 11 2025 5:41 AM | Updated on Jul 11 2025 10:57 AM

Medical students molested in Kakinada GGH

50 మంది పారా మెడికల్‌ విద్యార్థినులపై లైంగిక వేధింపులు

ఆర్‌ఎంసీలో ల్యాబ్‌ అటెండెంట్, ల్యాబ్‌ టెక్నీషియన్ల దాష్టీకం

సెల్‌ఫోన్లలో శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే పంపి బ్లాక్‌ మెయిల్‌ 

నెలరోజులుగా ఘాతుకం.. ఫిర్యాదు చేసిన విద్యార్థినులు.. బాధిత విద్యార్థినుల రహస్య విచారణ.. నేరం రుజువు

కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్‌లో కీచకఘట్టం వెలుగుచూసింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్‌ విద్యార్థినులు పలువురిపై అదే విభాగంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు సిబ్బంది సహకరించారు. నెల రోజులుగా సుమారు 50 మంది విద్యార్థినులపై ఈ దాష్టీకానికి పాల్పడ్డారు. బయటపెడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తామని బెదిరించడంతో తమపై జరుగుతున్న అకృత్యాన్ని భరిస్తూ వచ్చిన విద్యార్థినులు బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. 

విషయం రాష్ట్ర డీఎంఈకి చేరింది. వివరాల్లోకి వెళితే, కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్‌స్సీ–ఎంఎల్‌టీ విద్యనభ్యసిస్తున్న వారితో పాటు వివిధ ఒకేషనల్‌ కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్‌లోని ల్యాబ్‌లలో శిక్షణకు వస్తారు. నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో ఏడవ నంబర్, అంబానీ ల్యాబ్‌లలో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థినులు ఈ శిక్షణలకు హాజరు కాగా, అదే ల్యాబ్‌లో బయోకెమిస్ట్రీ ల్యాబ్‌ అటెండెంట్‌గా పని చేస్తున్న కళ్యాణ్‌ చక్రవర్తి అనే ఆర్‌ఎంసీ రెగ్యులర్‌ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

అతడికి మరో ముగ్గురు ల్యాబ్‌ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌కు మెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్‌ కంప్లైంట్స్‌ కమిటీకి ఫిర్యాదు పంపారు. ఒక హెచ్‌వోడీ, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లతో కూడిన కమిటీ ఈ నెల 9, 10వ తేదీలలో 48 మంది విద్యార్థులను విచారించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణ్‌ చక్రవర్తితో పాటు అతడికి సహకరించిన మైక్రోబయాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ జిమ్మీ రాజు, బయోకెమిస్ట్రీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ గోపాలకృష్ణ, పాథాలజీ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ప్రసాద్‌లను విచారించింది. 

విద్యార్థినులు ఆరోగ్య పరీక్షల్లో నిమగ్నమై ఉండగా వారికి తెలియకుండా వారి శరీర భాగాలు ఫొటోలు తీసి వారికే వాట్సాప్‌ చేసే వాడనీ, వాటిని మరెవరికీ షేర్‌ చేసి తమ బాధ బయటికి చెప్పుకునే అవకాశం లేకుండా వన్‌ టైం వ్యూ ద్వారా పంపేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను చెప్పినట్లు వినకపోతే, పరీక్షల్లో ఫెయిల్‌ చేయిస్తానని బెదిరించాడని కళ్యాణ్‌ చక్రవర్తిపై విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఈ తంతు అంతటికీ జిమ్మీ రాజు, గోపాలకృష్ణ, ప్రసాద్‌ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధ్యుల్ని తక్షణమే సస్పెండ్‌ చేయాలని డీఎంఈ ఆదేశించినట్లు తెలిసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement