
న్యాయమూర్తులు జస్టిస్ రాయ్, జస్టిస్ సుబేందు, జస్టిస్ రమేష్ ల నియామకం
రాష్ట్రపతి ఆమోదంతో కేంద్రం ఉత్తర్వులు
33కి చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
పదోన్నతిపై త్వరలో మరో ముగ్గురు న్యాయాధికారులు
సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తులు బదిలీపై రానున్నారు. వేర్వేరు హైకోర్టుల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ఉన్నారు.
వీరిలో జస్టిస్ రాయ్ నెంబర్ 2, జస్టిస్ రమేష్ నెంబర్ 6, జస్టిస్ సుబేందు 18వ స్థానంలో ఉంటారు. ఈ ముగ్గురూ తక్షణమే ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. దీంతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చెందిన జస్టిస్ రాయ్, జస్టిస్ రమేష్ 2023లో బదిలీ అయ్యారు. అప్పటి నుంచి వీరు గుజరాత్, అలహాబాద్ హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
అలాగే, జస్టిస్ సుబేందు సమంత ప్రస్తుతం కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న కేంద్రానికి సిఫారసు చేస్తూ తీర్మానం చేసిన విషయం తెలిసిందే.
హైకోర్టుకి ముగ్గురు న్యాయాధికారులు..
ఇదిలా ఉండగా.. న్యాయాధికారుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జిల్లా ప్రధాన జడ్జిగా ఉన్న గంధం సునీత, విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆలపాటి గిరిధర్, రాష్ట్ర జుడీషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం హైకోర్టు న్యాయమూర్తులు కానున్నారు. వీరి పేర్లను హైకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. కేంద్ర హోమ్ శాఖ నుంచి ఇంటెలిజెన్స్ నివేదిక వెళ్లగానే సుప్రీంకోర్టు కొలీజియం వీరి నియామకంపై నిర్ణయం తీసుకుంటుంది.
న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ ప్రస్థానం ఇదీ..
విజయనగరం జిల్లా, పార్వతీపురానికి చెందిన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ 1964 మే 21న విశాఖపట్నంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. తల్లి విజయలక్ష్మి, తండ్రి నరహరిరావు. ప్రాథమిక విద్యను పార్వతీపురంలోని ఆర్.సి.ఎం. పాఠశాలలో, ఉన్నత విద్యను విశాఖపట్నంలోని సెయింట్ అలోసియస్ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. విశాఖపట్నంలోని ఎం.వి.పి. లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1988 జూలైలో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు.
1988 నుంచి 2002 వరకు 14 ఏళ్ల పాటు పార్వతీపురం, విజయనగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ వారి కుటుంబంలో మూడో తరం న్యాయవాది. ఆయన తాత చీకటి పరశురాం నాయుడు ప్రసిద్ధ న్యాయవాది, రాజనీతిజు్ఞడు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికైన జస్టిస్ రాయ్ అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల విధులు నిర్వర్తించారు.
అలాగే ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌గా 2015 జూలై 3 నుంచి 2018 డిసెంబర్ 31 వరకు సేవలందించారు. 2019 జనవరి 1న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటయిన తరువాత తొలి రిజిస్ట్రార్ జనరల్‌గా పనిచేశారు. 2019 జూన్ 20న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2023లో గుజరాత్ హైకోర్టుకు బదిలీపై వెళ్లారు.న్యాయమూర్తి
జస్టిస్ దొనడి రమేష్ ప్రస్థానం ఇదీ..
చిత్తూరు జిల్లా, మదనపల్లె సమీపంలోని కమ్మపల్లికి చెందిన జస్టిస్ దొనడి రమేష్ 1965 జూన్ 27న జన్మించారు. ఆయన తల్లి అన్నపూర్ణమ్మ. తండ్రి డి.వి.నారాయణ నాయుడు. ఈయన పంచాయతీ రాజ్ శాఖలో ఇంజినీర్‌గా పదవీ విరమణ చేశారు. జస్టిస్ రమేష్ తిరుపతిలోనిశ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1987–90 కాలంలో వి.ఆర్. లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలో డిగ్రీ పొందారు.
1990లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ఆరంభించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్. నారాయణ వద్ద వృత్తిలో మెళకువలు నేర్చుకున్నారు. 2000 డిసెంబర్ నుంచి 2004 వరకు ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించారు.
2007లో ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్‌కు న్యాయవాదిగా ఉన్నారు. 2014లో ప్రత్యేక ప్రభుత్వ పక్ష న్యాయవాదిగా నియమితులై 2019 మే వరకు కొనసాగారు. 2020 జనవరి 13న హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం 2023 జూలై 24న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
న్యాయమూర్తి జస్టిస్ సుబేందు సమంత ప్రస్థానం ఇదీ..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన జస్టిస్ సుబేందు సమంత 1971 నవంబర్ 25న జన్మించారు. హమిల్టోన్‌లో పాఠశాల విద్య, తమ్లుక్‌లో హైసూ్కల్ విద్య పూర్తి చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం హజ్రా క్యాంపస్‌లో లా డిగ్రీ పొందారు. తమ్లుక్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.
అనంతరం అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. కలకత్తాలోని సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయాధికారిగానూ వ్యవహరించారు. అండమాన్ నికోబార్‌లో జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన జస్టిస్ సుబేందు.. కలకత్తా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగానూ వ్యవహరించారు. 2022 మే 18న కలకత్తా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2025 ఏప్రిల్ 28న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.