వాటాలు తేల్చాకే కాళేశ్వరానికి మూడో టీఎంసీ

Third TMC for Kaleshwaram After Settling Stakes - Sakshi

గోదావరి బోర్డుకు తేల్చి చెప్పిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి:  గోదావరి జలాల్లో నీటి వాటాలు తేలే వరకు మూడో టీఎంసీని తరలించడానికి కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు అనుమతి ఇవ్వకూడదని గోదావరి బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. విభజన చట్టం ప్రకారం ట్రిబ్యునల్‌ ద్వారా నీటి వాటాలు తేలే వరకు లేదా నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరాకే కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని గుర్తు చేసింది. కానీ.. నిబంధనలను తుంగలో తొక్కి గోదావరి జలాలను రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా కాళేశ్వరం ఎత్తిపోతలకు 2018 జూన్‌ 6న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపింది. నీటి వాటాలు తేలేదాకా ఆ అనుమతిని పునఃసమీక్షించడంతో పాటు మూడో టీఎంసీకి అనుమతి ఇవ్వొద్దని గోదావరి బోర్డు చైర్మన్‌ ఎంకే సిన్హాకు తెగేసి చెబుతూ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ లేఖ రాశారు. వాటాలు తేలకుండానే ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులకు అనుమతి ఇస్తే.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించినట్లేనని తేల్చి చెప్పారు. ఏపీ హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత గోదావరి బోర్డుపై ఉందని గుర్తు చేశారు.

కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటైతేనే..
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌(జీడబ్ల్యూడీటీ)ను కేంద్రం ఏర్పాటు చేయాలి. 2020 అక్టోబర్‌ 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో గోదావరి జలాలను పంపిణీ చేయడానికి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్రాన్ని కోరారు. కానీ.. ఇప్పటి దాకా ట్రిబ్యునల్‌ను కేంద్రం ఏర్పాటు చేయలేదు. ట్రిబ్యునల్‌ ఏర్పాటైతేనే రెండు రాష్ట్రాల నీటి వాటాలు తేలే అవకాశం ఉంది. నీటి వాటాలు తేలకుండానే తెలంగాణ సర్కార్‌ చేపట్టిన కాళేశ్వరం (రెండు టీఎంసీలు), చనాకా–­కొరటా, చిన్న కాళేశ్వరం, గుత్ప ఎత్తిపోతలకు సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇవ్వడంపై ఏపీ ప్రభుత్వం గోదావరి బోర్డు సమావేశాల్లో, కేంద్ర జల్‌ శక్తి శాఖ సమావేశాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతి లేకుండానే కాళేశ్వరం ఎత్తిపోతల విస్తరణ (మూడో టీఎంసీ తరలింపు) పనులు చేపట్టడంపై తెలంగాణ రైతులు ఫిర్యాదు చేయడంతో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ పరిశీలనను గోదావరి బోర్డు ఆపేసింది. ఈ నెల 6న ఆ డీపీఆర్‌ను పరిశీలించాలని గోదావరి బోర్డుకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది.

ఏపీకి 1,238.436 టీఎంసీలు అవసరం 
గోదావరి పరివాహక ప్రాంతం(బేసిన్‌)­లో ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులకు 1,238.436 టీఎంసీలు అవసరమని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదించింది. 

ఇందులో ఇప్పటికే పూర్తయి, వినియో­గంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు పోలవ­రానికి 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 737.153 టీఎంసీలను బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించింది. ఉమ్మడి రాష్ట్ర­ంలో చేపట్టి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు 75 శాతం లభ్యత ఆధారంగా 165.280 టీఎంసీలు అవ­స­రం. మొత్తంగా 75 శాతం లభ్యత ఆధా­రంగా 902.433 టీఎంసీలు అవస­రం.  

వరద జలాలను వినియోగించుకునే పూర్తి స్వేచ్ఛను, ఎగువ రాష్ట్రాలకు కేటా­యించిన మిగిలిన నికర జలా­లను వాడుకునే హక్కును దిగువ రాష్ట్ర­మైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రిబ్యు­నల్‌ కల్పించింది. విభజన నేప­థ్యంలో బేసిన్‌లో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అవుతుంది. 336 టీఎంసీల వరద జలాలను వాడుకోవ­డా­నికి ప్రాజె­క్టులు చేపడతామని ఇప్పటికే కేం­­ద్రా­నికి ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top