
మెలియోడోసిస్ ఉన్నట్లు వార్తలొచ్చాయి
రక్త పరీక్షల్లో అవేమీ కనిపించలేదు..23 మంది చనిపోయినా క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేయలేదు
డీఎస్‌హెచ్ వైద్యురాలి నేతృత్వంలో కమిటీ
బాధ్యులపై చర్యలు తప్పవు: వైద్య మంత్రి సత్యకుమార్
గుంటూరు రూరల్: ‘‘కలుషిత నీరు అంటూ తురకపాలెంలో మరణాలకు రకరకాల కారణాలు చెబుతున్నారు. అసలు ఎలాంటి బ్యాక్టీరియా అనేది అంతుచిక్కలేదు. మెలియోడోసిస్‌పై సమాచారం లేదు. ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు వార్తలొచి్చనా రక్త నమూనాల పరీక్షల ఫలితాల్లో అలాంటిది కనిపించలేదు’’ అని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్ తెలిపారు. బాధితులకు గుంటూరు జీజీహెచ్‌లో పూర్తి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తురకపాలెంలో శుక్రవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి ఆయన పర్యటించారు.
జూలై నుంచి 23 మంది చనిపోయారని, అయినా క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది ఉన్నతాధికారులను అప్రమత్తం చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మరణాలకు కారణాలపై లోతుగా విశ్లేషణ చేస్తున్నామని, 14 వైద్య బృందాలు ఏర్పాటు చేశామన్నారు. అందరి రక్త, నీరు, మట్టి నమూనాలూ తీసుకున్నారని చెప్పారు. తురకపాలెంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లి పరీక్షల నిర్వహణ వివరాలను మంత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
మరణాల సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెంటనే తీసుకురావడంలో జరిగిన వైఫల్యాలు గుర్తించేందుకు, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఏం చేయాలన్న దానిపై సిఫారసులు చేసేందుకు ఐఏఎస్ అధికారి, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డాక్టర్ అట్టాడ సిరి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. విధి నిర్వహణలో విఫలమైన వైద్య ఆరోగ్య సిబ్బందిపై శాఖాపరంగా చర్యలుంటాయన్నారు.