ట్రూఅప్‌కు తాత్కాలిక బ్రేక్‌ | Temporary break for Energy adjustment charges in AP | Sakshi
Sakshi News home page

ట్రూఅప్‌కు తాత్కాలిక బ్రేక్‌

Nov 21 2021 5:16 AM | Updated on Nov 21 2021 9:29 AM

Temporary break for Energy adjustment charges in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీల (ట్రూ అప్‌)కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. విద్యుత్‌ బిల్లుల్లో ట్రూఅప్‌ చార్జీలను ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల చార్జీలతో కలిపి సెప్టెంబరు, అక్టోబరు నెలల బిల్లుల్లో వసూలు చేశారు. దీంతో డిస్కంలు తమ నష్టాల్ని కొంత మేర భర్తీ చేసుకోగలిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తన ఆదేశాలను వెనక్కి తీసుకోవడంతో ఈ నెల విద్యుత్‌ బిల్లులు (అక్టోబరు చార్జీలు) ట్రూఅప్‌ చార్జీ లేకుండానే వినియోగదారులకు అందాయి.

రెండు నెలలు వసూలు
2014–15 ఆర్థిక సవంత్సరం నుంచి 2018–19 మధ్య కాలానికి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) సమర్పించిన రూ.7,224 కోట్ల ట్రూ అప్‌ చార్జీల పిటిషన్ల ఆధారంగా ఏపీఈఆర్సీ రూ.3,669 కోట్ల వసూలుకు ఆగస్టులో అనుమతినిచ్చింది. సెప్టెంబర్, అక్టోబరు నెలల బిల్లుల్లో ఆ మేరకు డిస్కంలు చార్జీలు విధించాయి. వీటిపై పలు న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఏపీఈఆర్‌సీ తన ఉత్తర్వులను నిలిపివేసి మళ్లీ విచారణ చేపట్టింది. అక్టోబర్‌ 19న ఒకసారి,  నవంబర్‌ 1న మరోసారి అభిప్రాయ సేకరణ జరిపింది. ఇంకా నిర్ణయాన్ని ప్రకటించలేదు. దీంతో డిస్కంలు నవంబర్‌ నెల బిల్లు.. అంటే అక్టోబర్‌ నెల వినియోగానికి ట్రూ అప్‌ చార్జీలు వేయలేదు. ఫలితంగా రెండు డిస్కంల పరిధిలోని దాదాపు 1.27 కోట్ల విద్యుత్‌ వినియోగదారులకు ఏపీఈపీడీసీఎల్‌ పరిధిలో యూనిట్‌కు రూ.0.45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలో రూ.1.27 పైసలు చొప్పున చార్జీలు తగ్గాయి. సాధారణ వినియోగానికే బిల్లు పడింది.

ఈ నెల 24న మరోసారి విచారణ
మరోవైపు 2019–20 ఆర్ధిక సంవత్సరానికి ఏపీఈపీడీసీఎల్‌ రూ.701.28 కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.1,841.58 కోట్లు చొప్పున మొత్తం రూ.2,542.86 కోట్ల ట్రూ అప్‌ చార్జీల వసూలుకు అనుమతి కోరుతూ ఏపీఈఆర్‌సీకి పిటిషన్లు దాఖలు చేశాయి. అదే విధంగా 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 మధ్య రూ.528.71 కోట్ల ట్రాన్స్‌మిషన్‌ బిజినెస్‌ ట్రూ అప్‌ చార్జీల వసూలు పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీట్రాన్స్‌కో) సమర్పించింది. వీటన్నిటిపైనా ఏపీఈఆర్‌సీ ఈనెల 24న ప్రజాభిప్రాయసేకరణ చేపట్టనుంది. వీటితో కలిపి, ఇప్పటికే విచారణ పూర్తయిన ట్రూ అప్‌ చార్జీల్లో ఎంత వసూలు చేయాలనేది ఏపీఈఆర్‌సీ నిర్ణయంపై అధారపడి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement