ఏపీకి ‘స్విస్‌’ సిమెంట్‌ టెక్నాలజీ!

Swiss Agency Offers ECO Friendly LC3 Technology To AP Cement Industry - Sakshi

రాష్ట్రానికి లైంస్టోన్‌ కాల్సిన్డ్‌ క్లే సిమెంట్‌ సాంకేతికత అందించేందుకు సంసిద్ధత 

సిమెంట్‌ తయారీలో క్లింకర్‌ అనే ముడి పదార్థంతో కాలుష్యం 

సున్నపురాయిలో ఎల్సీ–3 

మిక్స్‌తో తగ్గనున్న కాలుష్యం, విద్యుత్‌ వినియోగం

ఇంధన శాఖకు స్విట్జర్లాండ్‌ ప్రతిపాదన

సాక్షి, అమరావతి: వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి, విద్యుత్‌ను పొదుపు చేయగలిగే సామర్థ్యం గల కొత్తరకం సిమెంట్‌ మిక్స్‌ సాంకేతికతను రాష్ట్రానికి అందించేందుకు స్విట్జర్లాండ్‌కు చెందిన స్విస్‌ ఏజెన్సీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కో–ఆపరేషన్‌ (ఎస్డీసీ) ముందుకొచ్చింది. లైంస్టోన్‌ కాల్సిన్డ్‌ క్లే సిమెంట్‌ (ఎల్సీ–3) అనే ఈ కొత్త సాంకేతికత సిమెంట్‌ పరిశ్రమలకు లాభాలను కూడా తెచ్చిపెడుతుందని వివరించింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌ ఎంబసీ కో–ఆపరేషన్, డెవలప్‌మెంట్‌ హెడ్‌ జోనాథన్‌ డెమింగే ప్రతిపాదించినట్లు ఇంధన శాఖ గురువారం వెల్లడించింది.
చదవండి: ‘సంక్షేమం’ ఖర్చులో ఏపీదే అగ్రస్థానం

సిమెంట్‌ తయారీ రంగంలో మన దేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. క్లింకర్‌ అనే ముడి పదార్థాన్ని సిమెంట్‌ తయారీలో ఎక్కువ మోతాదులో ఉపయోగించటంవల్ల అది వాతావరణ కాలుష్యానికి దారితీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సాధారణంగా సిమెంట్‌ తయారీలో ఉపయోగించే ముడిపదార్థాల్లో 95 శాతం క్లింకర్, 5 శాతం జిప్సం వాడతారు. కానీ, ఎస్డీసీ ప్రతిపాదిస్తున్న లైంస్టోన్‌ కాల్సిన్డ్‌ క్లే సిమెంట్‌ మిక్స్‌ను వాడటంవల్ల వాతావరణంలో కర్బన ఉద్గారాలు 40 శాతం తగ్గుతాయని, 20 శాతం ఇంధనాన్ని ఆదా చెయ్యొచ్చని ఇంధన శాఖ వెల్లడించింది. 

పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం.. 
ఇండో స్విస్‌ బీప్‌ ద్వారా ఏపీ గృహ నిర్మాణ పథకంలో ఇంటి లోపలి ఉష్ణోగ్రతలు తగ్గించే సాంకేతికతను కొన్ని రోజుల ముందే ప్రవేశపెట్టగా, ఇప్పుడు సిమెంట్‌ పరిశ్రమలకు ఎల్సీ–3 సాంకేతికతను అందించేందుకు స్విస్‌ ఏజెన్సీ ముందుకొచ్చింది. ఎస్డీసీ ప్రతిపాదించిన నూతన సిమెంట్‌ మిక్స్‌ సాంకేతికత గురించి ప్రభుత్వానికి వివరించి, పరిశ్రమల శాఖ సహకారంతో ఈ అంశాన్ని సిమెంట్‌ పరిశ్రమల దృష్టికి తీసుకెళ్తాం. 
– కె.విజయానంద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top