కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: ఏపీ ప్రభుత్వం

Strengthening measures for corona prevention in AP - Sakshi

బాధితులకు 38,578 పడకలు

రోజుకు 310 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా 

రాష్ట్రంలో 208 కోవిడ్‌ ఆస్పత్రులు

7,883 మంది అదనపు సిబ్బంది

18,762 కేంద్రాల ద్వారా వ్యాక్సినేషన్‌

కౌంటర్‌ అఫిడవిట్‌లో హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 38,578 పడకలు సిద్ధంగా ఉన్నాయని, రోజుకు 310 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని వివరించింది. రాష్ట్రంలో కోవిడ్‌ కట్టడి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశంపై సివిల్‌ లిబర్టీస్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సీజే జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో 208 ఆస్పత్రుల్ని కోవిడ్‌ ఆస్పత్రులుగా గుర్తించినట్లు ప్రభుత్వం అఫిడవిట్‌లో తెలిపింది.

ఈ ఆస్పత్రుల్లో 2,573 వెంటిలేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కోవిడ్‌ ఆస్పత్రుల్లో 21,518 పడకలు అందుబాటులో ఉన్నాయని, తక్కువ లక్షణాలున్న రోగుల కోసం 17,060 పడకలతో 36 కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించింది. ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో మొత్తం 38,578 పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పూర్తిగా ఉచితంగా చికిత్స చేస్తున్నట్లు వివరించింది.

కరోనా రోగులకు కోసం ప్రత్యేకంగా 24 గంటలు పనిచేసే 104 కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపింది. కోవిడ్‌ ఆస్పత్రుల్లో తగినన్ని ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. రోజుకు 310 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేస్తున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా 52 వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. ప్రతి ఆస్పత్రిలో ఆక్సిజన్‌ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. 

వైద్య, ఇతర సిబ్బంది నియామకం
ఇప్పటికే అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందికి అదనంగా 7,883 మందిని నియమించినట్లు ప్రభుత్వం తెలిపింది. అదనంగా నియమించినవారిలో స్పెషలిస్ట్‌ వైద్యులు 22 మంది, మెడికల్‌ ఆఫీసర్లు 1,183 మంది, స్టాఫ్‌ నర్సులు 1,958 మంది, టెక్నీషియన్లు 825 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 473 మంది, ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలు 2,519 మంది, స్వీపర్లు 903 మంది ఉన్నారని వివరించింది.

పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్‌
టీకాలు వేసేందుకు ప్రత్యేకచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. గన్నవరంలో రాష్ట్ర వ్యాక్సిన్‌ స్టోర్, కడప, విశాఖ, గుంటూరు, కర్నూలుల్లో ప్రాంతీయ కేంద్రాలు, 13 జిల్లా కేంద్రాల్లో వ్యాక్సిన్‌ స్టోర్స్‌తోపాటు రాష్ట్రంలో ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో 1,659 కోల్డ్‌ చెయిన్‌ పాయింట్లు  ఏర్పాటు చేసినట్లు  వివరించింది. 18,762 వ్యాక్సిన్‌ కేంద్రాల ద్వారా కరోనా టీకాలు వేస్తున్నట్లు తెలిపింది. వీటిలో 3,228 ప్రభుత్వ ఆస్పత్రులు, 533 ప్రైవేటు ఆస్పత్రులు, 11,159 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నట్లు వివరించింది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు 11 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు తెలిపింది. 

తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి: హైకోర్టు
రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరిగితే ఎదుర్కొనేందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నియమించిన నోడల్‌ అధికారుల పేర్లు, వివరాలను ఆస్పత్రుల వద్ద ప్రదర్శించాలని చెప్పింది. కరోనా పరీక్షల ఫలితాలు తొందరగా వచ్చేలా చూడాలని ఆదేశిస్తూ.. కేసు విచారణను మే 4వ తేదీకి వాయిదా వేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top