
కూటమి ప్రభుత్వ తీరుపై ముస్లింల రాష్ట్రవ్యాప్త ఆందోళన
వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం పిలుపుతో కదిలిన ఇమామ్, మౌజన్లు
అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు.. 11 నెలల గౌరవ వేతనం విడుదలకు డిమాండ్
ఎన్నికల కోడ్ వరకు గౌరవ వేతనం అందించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
కోడ్ ఉన్న మూడు నెలలతో కలిపి మొత్తం 17 నెలలకు ఇవ్వాల్సిన గౌరవ వేతనం
ఆరు నెలలకు మాత్రమే సరిపెట్టిన బాబు సర్కార్
మరో 11 నెలల గౌరవ వేతనం విడుదలలో తాత్సారం
దీంతో మసీదుల నిర్వహణలో ఇబ్బందులు
హామీల అమలుపై కూటమి సర్కారు నిర్లక్ష్యంపై పెల్లుబుకిన నిరసన
సాక్షి, అమరావతి: దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న గౌరవ వేతనం బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఇమామ్, మౌజన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నిర్వహించి జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. ముస్లింలకు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వం, కనీసం ఇమామ్, మౌజన్లకు సైతం గౌరవ వేతనం అందించడంలోను నిర్లక్ష్యం వహిస్తోంది.
దీంతో ఇమామ్, మౌజన్లకు అండగా వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రంగంలోకి దిగింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం బకాయిలు విడుదల చేయించేలా నిరసనకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఇమామ్, మౌజన్లు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్‌ల వద్ద శాంతియుత నిరసనలు తెలిపారు. జిల్లాల కలెక్టర్లకు గ్రీవెన్స్ సెల్‌లో వినతిపత్రాలు సమర్పించారు.
జగన్ హయాంలో బకాయిల మాటే లేదు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతేడాది మార్చి వరకు (ఎన్నికల కోడ్ వచ్చే వరకూ) ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనాన్ని బకాయిలు లేకుండా అందించింది. ఆ తర్వాత కోడ్ అమలులోకి రావడంతో ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల గౌరవ వేతనం పెండింగ్‌లో ఉండిపోయింది. అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఇమామ్, మౌజన్లకు ఆలస్యంగా ఆరు నెలలకు మాత్రమే గౌరవ వేతనం విడుదల చేసి సరిపెట్టింది.
వాస్తవానికి గతేడాది ఏప్రిల్‌నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు 17 నెలల కాలానికి గౌరవ వేతనం బకాయిలను కూటమి ప్రభుత్వం అందించాల్సి ఉంది. కేవలం ఆరు నెలలకు మాత్రమే ఇవ్వడంతో ఇంకా 11 నెలల బకాయిలు విడుదల చేయాల్సి ఉంది. దీంతో మసీదులను నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందని ఇమామ్, మౌజన్లు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.
ముస్లింలకు హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్రంలో ముస్లింలకు కూటమి ఇచ్చిన 12కుపైగా హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఈ దిశలో కనీస చర్యలు లేవు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కూటమి హామీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బడ్జెట్‌లలో మైనారిటీ సంక్షేమం కోసం కేటాయించిన నిధుల వ్యయాలను శ్వేతపత్రంలో వివరించాలి. కనీసం ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. – బీఎస్ గౌస్ లాజమ్, ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్