ధైర్యమే జీవితం.. బతికి సాధిద్దాం | Sakshi
Sakshi News home page

ధైర్యమే జీవితం.. బతికి సాధిద్దాం

Published Thu, Sep 10 2020 10:49 AM

Special Story on World Suicide Prevention Day - Sakshi

జీవితం ఒక వరం..ఎంతో అందమైనది.. విలువైనది కూడా.  దానిని తనివితీరా ఆస్వాదించాలి. అనుభవించాలి. ఇందులో ఒడి దుడుకులు.. కష్ట నష్టాలూ ఎదురవుతుంటాయి.  అవి జీవనంలో ఓ భాగమే కానీ శాశ్వతం కాదు. ఈ విషయం తెలిసి కూడా   కొందరు అందమైన జీవితాన్ని అర్ధతరంగా కాలదన్నుకుంటున్నారు.  చిన్న చిన్న కారణాలతో తమ వందేళ్ల ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేస్తున్నారు.  ఈ బలవన్మరణానికి ముందు ఒక్క క్షణం ఆగి.. ధైర్యమే జీవితం.. బతికి సాధిద్దామనుకుంటే.. భవిష్యత్‌ బాగుంటుంది. మరెన్నో జీవితాలు నిలబడతాయి.   నేడు ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం’ సందర్భంగా ప్రత్యేక కథనం.    

కర్నూలు(హాస్పిటల్‌): రోజురోజుకు  క్రైమ్‌లు పెరిగిపోతున్నాయి.  ఉదయం పేపర్‌ చూడగానే   అవే వార్తలు కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా బలవన్మరణ వార్తలుండటం బాధాకరం.  ఇలాంటి కథనాలు చదివితే అయ్యే అనిపిస్తోంది.  ఎందుకింత పనిచేశాడని భావిస్తాము. చదివే పాఠకుడికే ఆ వార్త అంత బాధకలిగిస్తే  ఆత్మహత్య చేసుకునే సయమంలో సదరు వ్యక్తి   ఎంత ఇబ్బంది పడి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో వారి మనోవేదన తీవ్రంగా ఉంటుంది. ఈ క్రమంలో జిల్లాలో 2018లో 323, 2019లో 345, 2020లో ఇప్పటి వరకు 230 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, పిల్లలకు మంచి విషయాలు చెప్పేవారు లేకపోవడం, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, టీవీ సీరియళ్లు మొదలైన అంశాలు ఆత్మహత్యలు పెరిగేందుకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.  

ఆత్మహత్యకు దారి తీసే కారణాల్లో కొన్ని
ఆత్మహత్యకు చాలా సందర్భాల్లో బలమైన కారణాలు ఉండకపోవచ్చు. ఒక వ్యక్తి బాగా మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, తమకు ఏం చేయాలో, సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడతారు. ఉద్యోగం లేదని, మునుపటి ఆత్మహత్య ప్రయత్నాలు, సంబంధ బాంధవ్యాల్లో సమస్యలు, గతంలో జరిగిన విషయాలు, మానసిక రుగ్మతలు, మత్తు మందులకు బానిస, విపరీతమైన భయం, ఎక్కువగా నిరాశకు గురికావడం, కుటుంబ చరిత్ర,  విపరీతమైన అప్పులు, జీవితంపై నమ్మకం సన్నగిల్లడం, వ్యవసాయంలో నష్టాలు, పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటాయి.  

హెచ్చరిక సంకేతాలు 
హఠాత్తుగా నిద్ర, ఆహార అలవాట్లు మారడం 
ఇతరులకు తాము భారం అవుతున్నట్లు మాట్లాడటం 
మోసగించబడినట్లుగా మాట్లాడటం 
నేనెందుకు జీవించాలని భావించడం 
కుటుంబం, స్నేహితుల నుంచి దూరంగా ఉండటం 
వీడ్కోలు పలకడానికి వ్యక్తులను కలవడం, పిలవడం 
విలువైన వస్తువులు వేరే వారికి ఇచ్చేయడం 
గతంలో జరిగిన విషయాలకు క్షమించమని అడగడం 
తరచూ అంతా అయిపోయిందని చెప్పడం 
భరించలేని బాధలో ఉండటం, ఏడవడం 
చికాకుతో ఉండటం 
ఒంటరిగా ఉండటం 

ఆత్మహత్యలను నివారిద్దామిలా... 
బాధల్లో ఉన్న వారిని ఒంటరిగా వదలకూడదు. అలాంటి వారికి దగ్గరలో హాని చేసుకునే వస్తువులు, పరికరాలు ఏవీ ఉంచకూడదు. వారి కదలికలు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. 
ఆత్మహత్య ప్రమాదాలు చాలా వరకు క్షణికావేశంలోనే జరుగుతుంటాయి. అందుకే ముందుగా ఆవేశాన్ని నిగ్రహించుకోవాలి. 
బలవన్మరణం చేసుకోవాలనుకున్న వ్యక్తుల కదలికలు, వారి మాటలు గమనిస్తూ ఉండాలి. వారిని ఇతరులతో పోల్చడం, అగౌరపరచడం, కొట్టడం చేయరాదు 
సమస్యను సానుభూతితో విని నలుగురు కలిసి ధైర్యం చెప్పాలి. 
వీలైనంత త్వరగా మానసిక నిపుణులను సంప్రదించి చికిత్స/సలహా తీసుకోవాలి.   
చిన్నపాటి విషయాలకే విలువైన జీవితాన్ని బలితీసుకోకుండా ఒక్క క్షణం ఆలోచించాలి.  
పుట్టిన ప్రతి ఒక్కరూ తప్పక చనిపోతారు. ఇంతలోనే తొందర పడాల్సిన పనిలేదు.  
కాలం అన్నింటికన్నా శక్తివంతమైనది. ఓర్పుతో ఉంటే అదే పరిష్కారం చూపిస్తుంది. 

కుటుంబ సభ్యుల పాత్ర కీలకం 
ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. నిరాశతో ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి. వారిని దగ్గరకు తీసుకుని ఆతీ్మయంగా ఓదార్చాలి. నేనున్నానంటూ భరోసా కలి్పంచాలి. సమస్య పరిష్కారానికి సూచనలు చేయాలి.  కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పాలి. విద్యార్థులైతే బాల్యం నుంచే వారిలో మనోధైర్యం నింపాలి. చిన్న చిన్న విషయాలే కాదు పెద్ద సమస్యలు వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలో వివరిస్తూ ఉండాలి.  
–డాక్టర్‌ కాటెం రాజశేఖరరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, కర్నూలు

ఐపీసీ 309 సెక్షన్‌ను రద్దు చేయాలి 
ఆత్మహత్య అనేకంటే ఇచ్ఛామరణం అనడమే సరైనది. ఐపీసీ 309 సెక్షన్‌ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం చేసి బతికిన వారిపై కేసులు పెడతారు. ఇప్పుడు ఆ సెక్షన్‌ రద్దు కోసం భారత లా కమిషన్‌ సిఫార్సు చేసింది. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది.  అలాంటి వారికి కావాల్సింది  సహాయం కానీ శిక్ష కాదు అని స్పష్టం చేసింది. ఆత్మహత్యకు ప్రయతి్నంచడాన్ని నేరంగా పరిగణిస్తున్న ఐపీసీ 309 సెక్షన్‌ను తొలగించేందుకు పార్లమెంటుకు సిఫార్సు చేసింది. దేశంలో గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నట్లు నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో వెల్లడించింది. 
–డాక్టర్‌ పెద్దిగారి లక్ష్మన్న, సైకాలజిస్టు, కర్నూలు      

Advertisement

తప్పక చదవండి

Advertisement