Smartphone Addiction: రాత్రిపూట స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారా? అయితే, జర జాగ్రత్త! మీకు తెలియకుండానే..

Smartphone Phone Addiction Problems In Telugu - Sakshi

8 పలమనేరు పట్టణంలో అద్దెగది తీసుకొని ఇంజనీరింగ్‌ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్‌ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్‌ (smart phone addiction)కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకొని ఇటీవలే మృతి చెందాడు.

పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు మొబైల్‌ కొనివ్వలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకొని ఆస్పత్రి పాలైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.  

ఒకప్పుడు ‘అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మోర్ట్‌ ఫోన్‌ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్‌ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్‌ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్‌ చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. పదుల సంఖ్యలో కంపెనీలను మార్కెట్‌ నుంచి తరిమేసింది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్‌ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్‌ బానిసలుగా మార్చేస్తోంది. 

పలమనేరు (చిత్తూరు): శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ముక్కుకు శ్వాస ఆడకపోయినా పర్వాలేదుగాని నిమిషం పాటైనా చేతిలో సెల్‌ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి యువత.  డ్రగ్స్‌కు బానిసైనట్లు స్మార్ట్‌ఫోన్‌ బందీఖానాలో జనం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్‌ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్‌ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్‌ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో పదిలక్షల ఫోన్లు 
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్‌ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లె వంటి పట్టణాల్లో మాత్రమే రిలయన్స్‌ మొబైల్‌ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్‌ కంపెనీలు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8వేల సెల్‌ఫోన్‌ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్‌ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. నాలుగేళ్ల నుంచి సెల్‌ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్‌ (టెలీఫోన్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రాయ్‌ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.  

అన్ని రంగాలపై ప్రభావం 
విద్యార్థులు సెల్‌ఫోన్‌ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకొని చదువుల్లో వెనుకబడడం, ఫెయిల్‌ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు ఈ మొబైల్‌ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్‌తోనే రోజంతా గడిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మొబైల్‌ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ)తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్లు్యహెచ్‌ఓ సర్వే వివరించింది.  

రాత్రి పూటే ప్రమాదకరం 
ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్‌చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్‌ నిల్వలు నశించి డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చీకట్లో సెల్‌ఫోన్‌ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్‌డాక్‌ సమస్యలు తప్పవు. రాత్రుల్లో ఫోన్‌ చూసే పిల్లలకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది.

సెల్‌ సమస్యలు:
► నిద్రలేమి, తలనొప్పి  
► భుజం, మెడ నొప్పి  
► బరువు పెరగడం 
► చూపు తగ్గిపోవడం  
► జ్ఞాపకశక్తి కోల్పోవడం 
► ఏకాగ్రత దెబ్బతినడం  
► డిప్రెషన్‌లోకి వెళ్లడం  

అనర్థాలపై అవగాహన అవసరం 
మితిమీరిన సెల్‌ఫోన్‌ వాడకంతో కలిగే అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లో పలు రకాల చోరీలు, నేరాలను చూసి వాటిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు.  ఇలాంటి వారికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. ఏదేనా అవసరం ఉంటే తప్ప ఫోన్‌ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. 
– గంగయ్య, డీఎస్పీ, పలమనేరు 

మానసిక ఇబ్బందులు తప్పవు  
పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్‌ ఉంటేనే అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలం పోయింది. చేతికి సెల్‌ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్‌ వాడడం వలన మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్‌ చూసేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి.  
– మమతారాణి, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top