జనవరి 9న సైనిక్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష 

Sainik School Entrance Exam on January 9th - Sakshi

దరఖాస్తులకు ఈనెల 26 వరకు గడువు

సాక్షి, అమరావతి: సైనిక్‌ స్కూళ్లలోని 6, 9 తరగతుల్లో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది జనవరి 9న ఆలిండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ వెల్లడించింది. ఈనెల 26 వరకు దరఖాస్తులకు గడువుగా నిర్ణయించారు. డిసెంబర్‌ చివరి వారంలో అడ్మిట్‌ కార్డులను విడుదల చేసి.. వచ్చే ఏడాది జనవరి 9న పరీక్ష నిర్వహిస్తారు. జనవరి చివరి వారంలో ‘కీ’, ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. మార్చిలో మెడికల్‌ టెస్టు నిర్వహించి.. ఏప్రిల్‌లో అడ్మిషన్లు చేపడతారు. 6వ తరగతిలో ప్రవేశం కోసం నాలుగు విభాగాల్లో 300 మార్కులకు పరీక్ష పెడతారు.

125 ప్రశ్నలతో కూడిన ఈ పరీక్షను విద్యార్థులు 2.30 గంటల్లో రాయాల్సి ఉంటుంది. ఇందులో గణితం నుంచి మూడేసి మార్కులకు 50 ప్రశ్నలు, జనరల్‌ నాలెడ్జి, లాంగ్వేజెస్, ఇంటెలిజెన్స్‌ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలుంటాయి. అలాగే 9వ తరగతిలో ప్రవేశం కోసం 400 మార్కులకు 150 ప్రశ్నలతో పరీక్ష పెడతారు. మూడు గంటల్లో వీటికి జవాబులు రాయాల్సి ఉంటుంది. గణితం నుంచి నాలుగేసి మార్కులకు 50 ప్రశ్నలు, ఇంగ్లిష్, ఇంటెలిజెన్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ విభాగాల్లో రెండేసి మార్కులకు 25 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top