నాకు సమాజంలో గౌరవం రావడానికి కారణం ఆ కుటుంబమే: ధర్మాన | Sakshi
Sakshi News home page

27 ఏళ్ల వయసు నుంచే ఆ కుటుంబంతో నా ప్రయాణం: ధర్మాన

Published Sat, Apr 16 2022 1:04 PM

Revenue Minister Dharmana Prasada Rao CM YS Jagan Srikakulam - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ‘ముఖ్యమంత్రి లక్ష్యాలే మా లక్ష్యాలు. ఆయన ఆశయాలకు తగ్గట్టు పనిచేస్తాం. జిల్లాలోని వనరులను వినియోగించుకుని అభివృద్ధి చేస్తాం. అనుభవంతో ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని ఆ దిశగా ముందుకు వెళ్తాను’ అని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తన ప్రాధాన్యత అంశాలను వివరించారు. ప్రమాణస్వీకారం, బాధ్యతల స్వీకరణ తర్వాత తొలిసారిగా  ధర్మాన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. 

జీవన ప్రమాణాలు పెంచాలి.. 
జిల్లాలో సహజ వనరులు చాలా ఉన్నాయి. అయినా ప్రజల జీవన ప్రమాణాలు తక్కువగానే ఉన్నాయి. దీనిపై దృష్టి పెట్టాలి. 170 కిలోమీటర్ల హైవే, 200 కిలోమీటర్ల సముద్ర తీరం జిల్లాకు అడ్వాంటేజ్‌. వంశధార, నాగావళి నీళ్లను వినియోగంలోకి తీసుకువచ్చి వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తే మన ప్రాంతం అభివృద్ధి జిల్లాల సరసన నిలబడుతుంది.  

సీఎం స్పందించారు.. 
ఇటీవల సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి వంశధారలో 19 టీఎంసీల నీటిని సత్వరం వినియోగంలోకి తేవాల్సిన ఆవశ్యకతను వివరించాను. ఇప్పటికే వంశధార ప్రాజెక్టుపై వెచ్చించిన రూ.2వేల కోట్ల పెట్టుబడిని సద్వినియోగం చేసుకోవాలంటే కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వివరించాను. గొట్టా రిజర్వాయర్‌ వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని కోరితే దానికి ఆయన అంగీకరించడమే కాకుండా అనుమతి కూడా ఇచ్చారు. ఈ నెలాఖరుకల్లా ఇంజినీర్లు చేయాల్సిన పని అయిపోతే తర్వాత అడ్మినిస్ట్రేషన్‌ మంజూరు కోసం కమిటీకి తీసుకెళతాం. డిసెంబర్‌ నాటికి అది పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే రబీ పంటకు నీరివ్వాలన్నది మా ధ్యేయం. దీని వల్ల ఖరీఫ్‌ను ముందుకు తీసుకురావచ్చు. ఏటా వచ్చే తుఫాన్ల బారి నుంచి తప్పించుకోవచ్చు. రబీలో కూడా శివారు వరకు నీరు ఇవ్వవచ్చు.   

పారిశ్రామికంగా ముందుకు..  
జిల్లాలో ఇప్పటికే బుడగట్లపాలెంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తున్నాం. సంతబొమ్మాళి మండలంలో భావనపాడు పోర్టు నిర్మాణం చేపడతాం. వీటి వల్ల మత్స్య సంపద, గ్రానైట్‌ తదితర ఎగుమతులు జరిగి, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే జాతీయ రహదారి పొడవునా పరిశ్రమలు పెట్టుకోవడానికి వెసులుబాటు కలుగుతుంది.  

పారదర్శకతకు పెద్దపీట 
రెవెన్యూలోనే కాదు రిజిస్ట్రేషన్‌లోనూ పారదర్శకత, అవినీతి రహిత కార్యకలాపాలు జరిగేలా సంస్కరణలు చేపడతాం. ఫాస్ట్‌గా చేసే ప్రొసీజర్స్‌ను తీసుకొచ్చి, నిర్లక్ష్య భావాన్నంతా తొలగించి నిజాయితీతో కూడిన వ్యవస్థను రూపుదిద్దాలి. దీని కోసం ఏం చేయాలో నిపుణుల సలహాలు తీసుకుంటాం.  

ఇంటి కల సాకారం.. 
రాష్ట్రంలో ఇంతకుముందు ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లు పీఓటీ యాక్ట్‌ కింద ఉండేవి. అంటే ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్ట్‌. అయినా చాలా మంది ఇళ్లను విక్రయించారు. ఈ విక్రయాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. అందుకే ఇలాంటి వివాదాలు పరిష్కరించి యజమానులకు హక్కు ఇచ్చేలా శాశ్వత గృహ హక్కు పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనిపై ప్రతిపక్షాలవి అవగాహన లేని మాటలు. దీని వల్ల ప్రయోజనం స్వయంగా పొందిన వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. విమర్శించడమే పనిగా పెట్టుకున్న వారి మాటలు వినకూడదు.   

ఉద్దానం కోసం.. 
ఉద్దానం కిడ్నీ రోగుల కోసం ఇప్పటికే ఒక రీసెర్చ్‌ కమ్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ నిర్మిస్తున్నారు. అలాగే చక్కటి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం చేస్తోంది. ఈ పనులు గత ప్రభుత్వాల హయాంలో జరగలేదనే వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి. సీఎంకు ఉద్దానం ప్రాంతంపై ఫోకస్‌ ఉంది. అందులో భాగమే రూ.700కోట్ల మంచినీటి ప్రాజెక్టు నిర్మాణం. తిత్లీ, వంశధార పరిహారాలు పూర్తి చేయాల్సి ఉంది. ఆఫ్‌షోర్‌ కూడా పూర్తవుతుంది.  

కార్యకర్తలు కోరుకున్నట్టు.. 
పార్టీ కార్యకర్తలు కోరుతున్నట్లు పార్టీలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సీఎం ప్రత్యేకంగా చెబుతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కనుక అన్ని స్థాయిల్లో ఉత్సాహవంతులను తీసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ దిశగా మేమూ పని చేస్తాం. రీజనల్, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్‌ లెవెల్‌లో పార్టీ పునర్నిర్మాణం జరుగుతుంది. మేం అధికారంలో ఉన్నాం కాబట్టి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తాం. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు కూడా విశాల దృక్పథంతో ఆలోచించాలి. నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్న సీఎం వెనుక బలంగా నిలబడాలి.     

వైఎస్‌ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం 
నేను 1989లో మొట్టమొదటిసారిగా శాసనసభకు 27 ఏళ్ల వయసులో పోటీ చేశాను. వైఎస్సార్‌ ఆ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఆ కుటుంబంతో నా ప్రయాణం కొనసాగుతోంది. నాకు ఈనాడు సమాజంలో గౌరవం రావడానికి కారణం ఆ కుటుంబమే. ఇప్పుడు ఆయన తనయుడైన జగన్‌మోహన్‌రెడ్డి తన కేబినెట్‌లో అవకాశం ఇచ్చారు. అలాంటి విశ్వాసాన్ని నిలుపుకోవడం, వారి లక్ష్యాల కోసం పనిచేయడం నా బాధ్యత.   

Advertisement
 
Advertisement
 
Advertisement