
తురకపాలెం ప్రజల మరణాలపై ప్రాథమికంగా నిర్ధారణ
గ్రామంలో పిల్లలు మినహా అందరికీ వైద్య పరీక్షలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెం గ్రామ ప్రజల మరణాలపై మిస్టరీ వీడనుంది. గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాల స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు, పెథాలజిస్టులు, మైక్రోబయాలజిస్టులు, బయోకెమిస్టులు గ్రామస్తుల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు. గ్రామంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, ఆయాసం, దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు ఉన్నవారికి అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు.
గ్రామ ప్రజల మరణాలకు అత్యంత అరుదైన మెలియోడోసిస్ వ్యాధి కారణమని దాదాపు నిర్ధారించారు. బర్డె్కలియా–సుడోమలై అనే బ్యాక్టీరియా వల్ల ప్రజలు జ్వరాల బారిన పడి మరణిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
40 రకాల వైద్య పరీక్షలు
తురకపాలెం గ్రామంలో 2,507 మంది జనాభా ఉన్నారు. వీరిలో సుమారు 500 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలకు మినహా మిగతావారందరికి గుంటూరు వైద్య కళాశాల, జీజీహెచ్ వైద్యులు, వైద్య సిబ్బంది సుమారు 40 రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. శనివారం శాంపిల్స్ సేకరించి వైద్య కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏవీ సుందరాచారి, గుంటూరు డీఎంహెచ్‌వో డాక్టర్ కొర్రా విజయలక్ష్మి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ ఆధ్వర్యంలో పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గత నెలలో స్పందించి ఉంటే...
గత నెలలోనే తురకపాలెంలో జ్వరంతో బాధపడుతున్న వారికి గుంటూరులోని ఇన్‌ఫెక్షన్స్ స్పెషలిస్టు డాక్టర్ కోగంటి కళ్యాణ్‌చక్రవర్తి వైద్య పరీక్షలు చేసి, మెలియోడోసిస్ వ్యాధిగా నిర్ధారించారు. ఆ విషయం మీడియా ద్వారా సైతం వెల్లడించారు. ప్రైవేటు వైద్యుడు వ్యాధి నిర్ధారించి, చికిత్స అందించి ప్రాణాలు కాపాడిన సమయంలోప్రభుత్వ వైద్య అధికారులు, జిల్లా, రాష్ట్ర యంత్రాంగం స్పందించి ఉంటే మరణాల సంఖ్య తగ్గించే అవకాశం ఉండేది. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే మరణాలు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తురకపాలెంలో ‘ఈనాడు’ ప్రతుల దహనం
మృతుల గురించి అసత్య ప్రచురణలు అసహ్యం కలిగిస్తున్నాయి
ఎయిడ్స్‌తో మృతి చెందారని ఈనాడు, ఈటీవీల్లో ప్రచారం చేయటం దారుణం
బాధితులకు న్యాయం చేయాల్సిన మీడియా ప్రభుత్వానికి కొమ్ముకాయడం దుర్మార్గం
గ్రామ ప్రజల ఆగ్రహం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా తురకపాలెంలో మెలియోడోసిస్ బ్యాక్టీరియాతో యువత సైతం మృత్యువాత పడుతుంటే ఈనాడు, ఈటీవీల్లో మృతుల పట్ల అసత్య ప్రచారం చేయడం అసహ్యం కలిగిస్తోందని గ్రామస్తులు మండిపడ్డారు. గ్రామంలోని యువకులు ఎయిడ్స్, షుగర్, వంటి దీర్ఘకాలిక వ్యాధులతో మృతి చెందారని టీవీలో బాహాటంగా ప్రచారం చేయటం గ్రామ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తంచేశారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఈనాడు దినపత్రిక ప్రతులను శనివారం గ్రామ ప్రజలు దహనం చేశారు.
బాధలో తాముంటే, న్యాయం చేయాల్సింది పోయి మృతుల గురించి అసత్య వార్తలు ప్రచారం చేయటం సిగ్గుచేటన్నారు. ఇంటి పెద్దలు మృతిచెంది పిల్లలు, తల్లులు రోడ్డున పడ్డ సమయంలో ఇటువంటి అసత్య ప్రచారం చేసి గ్రామ పరువును, ప్రతిష్టను దెబ్బతీసిన ఈనాడు, ఈటీవీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డౌన్ డౌన్ ఈనాడు, ఈటీవీ, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. అన్యాయంపై ప్రభుత్వాన్ని ప్రశి్నంచాల్సిన మీడియా ఇలా ప్రభుత్వానికే కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.