పోలీసులపై బాలుడి హత్య కేసు నిందితుడి దాడి | Police attacked by accused in boy assassination incident | Sakshi
Sakshi News home page

పోలీసులపై బాలుడి హత్య కేసు నిందితుడి దాడి

Mar 28 2026 3:46 AM | Updated on Mar 28 2026 3:47 AM

Police attacked by accused in boy assassination incident

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా బీరు సీసాతో కానిస్టేబుల్, సీఐపై దాడి చేసి తప్పించుకునేందుకు యత్నం  

ఆరు రౌండ్లు కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్న పోలీసులు  

అనంతపురం జిల్లా కోనుప్పలపాడులో ఘటన  

తాడిపత్రి టౌన్‌: ఆస్తి కోసం బామ్మర్దిని హత్య చేసిన వ్యక్తిని ఘటనా స్థలానికి తీసుకెళ్లి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న సమయంలో పోలీసులపై ఒక్కసారిగా దాడి చేశాడు. ఘటనా స్థలంలో ఉన్న బీరు సీసాతో కానిస్టేబుల్, సీఐపై దాడి చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితునిపై సీఐ ఆరు రౌండ్లు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం కోనుప్పలపాడులో బుధవారం గోవిందు, లక్ష్మీకాంతమ్మ దంపతుల కుమారుడు వేమచంద్ర (7)ను కిడ్నాప్‌ చేసి చంపేసిన విషయం తెలిసిందే. 

సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వేమచంద్ర పెద్ద అక్క భర్త (బావ) సర్వేష్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించి గురువారం అరెస్ట్‌ చేశారు. హత్య జరిగిన తీరును తెలుసుకునేందుకు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ ఎలా హత్య చేశాడో పోలీసులకు వివరిస్తూ ముందుకు వెళ్లిన సర్వేష్‌... సమీపంలో దొరికిన బీరు బాటిల్‌తో కానిస్టేబుల్‌ వెంకటేష్ పై దాడి చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన సీఐ రామసుబ్బయ్యపైనా దాడికి తెగబడ్డాడు. 

వెంటనే సీఐ గాల్లోకి కాల్పులు జరిపారు. నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా, అతని కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం నిందితుడిని, గాయపడిన పోలీసులను తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. సర్వేష్ ను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. తాడిపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్, సీఐలను ఎస్పీ జగదీష్‌ పరామర్శించారు.  అనంతరం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement