పోలవరం ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమస్యలపై ముందడుగు

Polavaram project is a breakthrough on interstate issues - Sakshi

3 రాష్ట్రాల జలవనరుల అధికారులతో కేంద్రం సమావేశం 

కరకట్టల నిర్మాణానికి ప్రజాభిప్రాయం సేకరించాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లకు ఆదేశం 

పోలవరం పనులపై స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ ఎత్తేసేందుకు పరిశీలిస్తామన్న కేంద్రం 

2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేసేలా ఏపీ అడుగులు వేస్తోందన్న పీపీఏ సీఈవో 

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేసే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. జలాశయం ముంపు నుంచి తప్పించడానికి శబరి, సీలేరు నదులకు కరకట్టలు నిర్మించడానికి వీలుగా యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసినప్పుడు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఏ మేరకు ఉంటుందో తేల్చడానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖల అధికారులు సభ్యులుగా జాయింట్‌ కమిటీని ఏర్పాటుచేస్తామని పేర్కొంది.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ చేసేవరకు పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయబోమని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పనుల నిలిపివేత ఉత్తర్వులను (స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌) తాత్కాలిక నిలుపుదల (అభయన్స్‌)లో పెట్టకుండా.. పూర్తిగా ఎత్తేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర సమస్యల పరిష్కారంపై కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి రామేశ్వర్‌ప్రసాద్‌ గుప్తాల నేతృత్వంలో సోమవారం వర్చువల్‌గా ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్, సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఎస్‌.కె.హల్దార్,  ఏపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ జలవనరులశాఖల కార్యదర్శులు జె.శ్యామలరావు, అనూగార్గ్, ఎన్‌.కె.అశ్వల్, ఏపీ ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

కరకట్టల నిర్మాణానికి సిద్ధం 
పోలవరంను 2022 నాటికి పూర్తి చేసేందుకు పనుల్ని వేగవంతం చేసిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సీలేరు, శబరి నదుల్లో బ్యాక్‌ వాటర్‌ వల్ల ముంపు సమస్య ఏర్పడకుండా ఒడిశాలో రూ.378.696 కోట్లతో 30.2 కిలోమీటర్లు, ఛత్తీస్‌గఢ్‌లో రూ.332.3 కోట్లతో 29.12 కిలోమీటర్ల కరకట్టల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు పీపీఏ సీఈవో చంద్రశేఖర్‌ అయ్యర్‌ చెప్పారు. ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను కోరుతూ 31 మార్లు ఏపీ ప్రభుత్వం, తాము లేఖలు రాశామని తెలిపారు. 

డిజైన్‌పై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్‌ 
గోదావరిలో 500 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని ఐఐటీ–రూర్కీ నివేదిక ఇచ్చిందని, కానీ 50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేలా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వేను నిర్మించారని ఒడిశా జలవనరులశాఖ కార్యదర్శి అనూగార్గ్‌ చెప్పారు. దీనివల్ల గరిష్ట వరద వచ్చినప్పుడు.. పోలవరం ప్రాజెక్టు నుంచి సీలేరు, శబరిల్లోకి వరద ఎగదన్ని ఒడిశాలో అధికభాగం ముంపునకు గురవుతుందన్నారు. 58 లక్షల క్యూసెక్కుల వరదను పరిగణనలోకి తీసుకుని ముంపు ప్రభావంపై అధ్యయనం చేసేవరకు ప్రాజెక్టు పనులను ఆపేయాలని కోరారు. దీనికి సీడబ్ల్యూసీ చైర్మన్‌ ఎస్‌.కె.హల్దార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలవరం భద్రత దృష్ట్యా.. బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ మార్గదర్శకాల ప్రకారం 50 లక్షల క్యూసెక్కుల వరదనైనా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం సిల్ప్‌ వే డిజైన్‌ను ఆమోదించామని చెప్పారు. ఈ అంశంలో సీడబ్యూసీదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. బ్యాక్‌ వాటర్‌ ప్రభావంపై మళ్లీ సర్వే చేయాలన్న అనూగార్గ్‌ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ హైడ్రాలజీ విభాగం డైరెక్టర్‌ నిత్యానందరాయ్‌ తోసిపుచ్చారు. 

జాయింట్‌ కమిటీతో అధ్యయనం 
పోలవరం ప్రాజెక్టులో వచ్చే ఏడాది ఏ మేరకు నీటిని నిల్వ చేస్తారు.. దానివల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ఉంటుందా? అని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అధికారులు ప్రశ్నించారు. దీనిపై ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు స్పందిస్తూ.. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం 2022లో 41.15 మీటర్ల మేర ప్రాజెక్టులో నీరు నిల్వ చేస్తామని, దీనివల్ల బ్యాక్‌ వాటర్‌ ముంపు ఉండదని చెప్పారు. అనంతరం కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ మాట్లాడుతూ గోదావరిలో 36 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ ప్రభావం వల్ల ముంపు ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు జాయింట్‌ కమిటీతో సర్వే చేయిస్తామని చెప్పారు. సీడబ్ల్యూసీ నేతృత్వంలో పీపీఏ, మూడు రాష్ట్రాల జవనరులశాఖల అధికారులు సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంతోపాటు జాయింట్‌ సర్వేను పూర్తిచేయాలని ఆదేశించారు. ఈలోగా ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ప్రజాభిప్రాయ సేకరణచేసి ఏపీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లను ఆదేశించారు. ఇందుకు ఆ రెండు రాష్ట్రాలు సమ్మతించాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top