
హైడ్రాలిక్ సిలిండర్ల ద్వారా గేటును 6 మీటర్ల ఎత్తుకు లేపిన దృశ్యం
సాక్షి, అమరావతి/పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ గేట్ల ట్రయల్ రన్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. స్పిల్‌వేకు అమర్చిన గేట్ల పనితీరును జల వనరుల శాఖ అధికారులు ప్రయోగాత్మకంగా పరిశీలించారు. శుక్రవారం 44, 43వ గేట్లను హైడ్రాలిక్ పవర్ ప్యాక్ యూనిట్ల (హెచ్‌పీయూ) సహాయంతో పైకెత్తి.. ఆ తర్వాత దించారు. తొలుత 44వ గేటును 6 మీటర్ల మేర పైకెత్తి.. 3 మీటర్ల మేర కిందకి దించి పలుమార్లు పరీక్షించారు. ఇదే రీతిలో 43వ గేటునూ పరీక్షించారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ల ప్రకారం గేట్లు పనిచేస్తుండటంతో సీఈ సుధాకర్‌బాబు, ఎస్‌ఈ నరసింహమూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా పోలవరం ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది.
ప్రపంచంలో గరిష్ట స్థాయిలో వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసే ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్ల సాయంతో పనిచేసే 48 గేట్ల (ఒక్కొక్కటి 20 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పు)ను అమర్చేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. 10 రివర్ స్లూయిజ్ గేట్లను అమర్చాలని ఆ డిజైన్లో పేర్కొంది. ఒక్కో గేటు 2,400 టన్నుల ఒత్తిడిని తట్టుకునేలా తయారు చేశారు. గోదావరికి వరద వచ్చినప్పుడు ఒక్కో గేటు నుంచి 1.04 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేయవచ్చు.
స్లూయిజ్ గేట్లు పూర్తి
10 రివర్ స్లూయిజ్ గేట్లకు గానూ అన్నిటినీ అమర్చారు. వాటిలో మూడు రివర్ స్లూయిజ్ గేట్లకు సిలిండర్లను అమర్చారు. గేట్లు, రివర్ స్లూయిజ్ గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను మే నాటికి పూర్తి చేసే దిశగా అధికారులు పనులను వేగవంతం చేశారు.
ఒక్కో పవర్ ప్యాక్‌తో రెండేసి గేట్లు
ఒక్కో గేటుకు స్పిల్‌వే దిగువ వైపున రెండు చివరల ఒక్కో హైడ్రాలిక్ హాయిస్ట్ సిలిండర్లను అమర్చారు. రెండు గేట్లకు సంబంధించిన నాలుగు హైడ్రాలిక్ సిలిండర్లను ఒక పవర్ ప్యాక్‌కు బిగించి.. వాటిని స్పిల్‌వే బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ పవర్ ప్యాక్ యూనిట్ల (హెచ్‌పీయూ)తో అనుసంధానం చేస్తున్నారు. అంటే రెండు గేట్లను ఒక పవర్ ప్యాక్‌తో పైకి ఎత్తడం, దించడం చేయవచ్చు. స్పిల్‌వేకు 48 గేట్లను అమర్చాల్సి ఉండగా.. ఇప్పటికే 34 గేట్లను కాంట్రాక్ట్ సంస్థ అమర్చింది. ఇందులో 28 గేట్లకు 56 హైడ్రాలిక్ సిలిండర్లను బిగించారు. పది గేట్లకు ఐదు పవర్ ప్యాక్‌లను బిగించి.. వాటిని హెచ్‌పీయూలతో అనుసంధానం చేశారు. పూర్తిస్థాయిలో సిద్ధమైన ఒక్కో గేటుకు ట్రయల్ రన్ నిర్వహిస్తూ.. వాటి పనితీరును పరిశీలిస్తున్నారు. మిగిలిన గేట్ల బిగింపు పనులను వేగవంతం చేశారు.